రిజిస్ట్రేషన్ సేవల పీపీపీ విధానంపై హైకోర్టులో విచారణ వాయిదా.
• జీఓ నెం.396 సవాల్‌పై మూడు వారాలకు వాయిదా.
• ప్రైవేటీకరణపై పిటిషనర్ అభ్యంతరాలు.
అమరావతి, మహా.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే)ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.396ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారించి తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం చట్టవిరుద్ధమని వాదించారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉన్న అధికారాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇందుకు శాసనసభలో చట్ట సవరణలు చేయకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) ద్వారా పీపీపీ విధానాన్ని అమలు చేయడం చట్టబద్ధం కాదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
పీపీపీ విధానం అమల్లోకి వస్తే వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.2 వేల వరకు ఫెసిలిటేషన్ ఛార్జీ విధించడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశముందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ సేవలను మరింత బలోపేతం చేయాల్సిందే గానీ ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల జోక్యంతో అవినీతి, అక్రమాలకు అవకాశం పెరుగుతుందని, ఆస్తుల వివరాలు, వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ డేటా భద్రతపై కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జీఓ అమలును నిలిపివేసి, ప్రభుత్వ అధికారుల ద్వారానే రిజిస్ట్రేషన్ సేవలను కొనసాగించాలని హైకోర్టును కోరారు.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పాముల బలరాం దాఖలు చేయగా, ఆయన తరఫున అడ్వకేట్ నర్రా శ్రీనివాస్‌రావు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను మూడు వారాల తర్వాత చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.







