Mahaa Daily Exclusive

  సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట…

Share

సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట.
* 2021 ఆఫీస్ మెమోరాండం రద్దు.
* ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు మాత్రం చెల్లుబాటేనని స్పష్టీకరణ.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు కీలక ఊరట కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను సుప్రీంకోర్టు చెల్లదని ప్రకటించినప్పటికీ, ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనడంతో, తెలంగాణలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి చట్టపరమైన ఆటంకం ఉండదనే స్పష్టత లభించింది.
కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండానే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ విధానం పర్యావరణ పరిరక్షణ చట్టాలు, నిబంధనలకు విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనలను కేవలం ఆఫీస్ మెమోరాండం ద్వారా మార్చడం రాజ్యాంగబద్ధంగా సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే ఇప్పటికే ఆ ఆఫీస్ మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులను రద్దు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అనుమతులపై ఆధారపడి కొనసాగుతున్న లేదా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు ఈ తీర్పు వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. దీంతో పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టుల పనులు యథావిధిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
భవిష్యత్తులో చేపట్టే అన్ని కొత్త ప్రాజెక్టులకు మాత్రం ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాల్సి వస్తే, కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేసి, పర్యావరణ చట్టాల పరిధిలోనే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టబద్ధ ప్రక్రియను పక్కనపెట్టడం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ తీర్పుతో తెలంగాణలో సాగుతున్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై నెలకొన్న న్యాయపరమైన అనిశ్చితికి తెరపడినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో సాగునీటి విస్తరణ, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పునరుద్ధరణకు కీలకంగా మారనున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు కారణంగా ఈ ప్రాజెక్టుల అమలులో ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు లేకుండా పనులు కొనసాగనున్నాయని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.