- పోటెత్తుతున్న కృష్ణమ్మ
- శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం
- జూరాల గేట్లు ఎత్తి వేసిన అధికారులు
- ఏల్నినో కష్టాల వేళ బిగ్ రిలీఫ్
హైదరాబాద్, మహా : వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సమయంలో కృష్ణానది జలకళను సంతరించుకుంటోంది. ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానా కాలం మొదలై రెండు నెలలైనా ఇప్పటివరకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో రాలేదు. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. దీంతో, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతోంది.
తెలుగు రాష్ట్రాలను రెండు నెలల కాలంగా ఎల్నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లోకుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. వారం రోజులుగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో జూరాలకు ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా… అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దాదాపు 30,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమ ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. జూరాలకు ఇన్ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పెరుగుతున్న ఇన్ ఫ్లో.. అధికారుల అప్రమత్తం
అదే సమయంలో ఎగువ నుంచి వచ్చే ప్రవాహం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా రానున్మన రోజుల్లో శ్రీశైలానికి మరింత ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా అటు గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక, కృష్ణాపై ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి బుధవారం 80 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. కాగా, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 89,520 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేస్తున్నారు. ఇక.. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 18,349 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 823.70కు చేరింది. రానున్న నాలుగు రోజుల్లో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని.. నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.








