మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన ట్రంప్.
* భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని మరోసారి ప్రకటన.
వాషింగ్టన్, మహా.
భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలను తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతోనే ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో పాటు భారత్–పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముందుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన ట్రంప్, ఆ యుద్ధాన్ని ముగించేలా ఒప్పందం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రపంచంలో అనేక ఘర్షణలను తాను నివారించానని చెప్పిన ఆయన, అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతలపై మాట్లాడారు.
“భారత్–పాక్ యుద్ధానికి మేమే ఫుల్‌స్టాప్ పెట్టాం. ఆ సమయంలో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి. పరిస్థితి అత్యంత భీకరంగా ఉంది. వెంటనే నేను సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చాను. యుద్ధం కొనసాగిస్తే 250 శాతం సుంకాలు విధిస్తానని చెప్పాను. దీంతో వారు తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత మళ్లీ నన్ను సంప్రదించి యుద్ధం చేయబోమని చెప్పారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను అభినందించారని కూడా ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాన్ని అడ్డుకోవడం ద్వారా సుమారు 50 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడినందుకు షెహబాజ్ షరీఫ్ తనను ప్రశంసించారని ఆయన అన్నారు.
అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ గతంలోనే పలుమార్లు ఖండించింది. భారత్–పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ పూర్తిగా ద్వైపాక్షిక ప్రక్రియ అని, ఇందులో ఏ మూడో దేశం మధ్యవర్తిత్వం లేదా జోక్యం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే యుద్ధ సమయంలో 11 ఫైటర్ జెట్లు కూలిపోయాయన్న ట్రంప్ వ్యాఖ్యలను కూడా భారత్ ఇప్పటికే నిరాధారమని తోసిపుచ్చింది.
భారత్ వైఖరి ప్రకారం, పాకిస్థాన్‌తో ఉన్న అన్ని అంశాలు ద్వైపాక్షికంగానే పరిష్కరించబడతాయని, మూడో దేశం మధ్యవర్తిత్వానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.







