Mahaa Daily Exclusive

  విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం…

Share

విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
• కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.

హైదరాబాద్, మహా.

పాలమూరు జిల్లాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. అలాంటి శాంతియుత నిరసనలను అణచివేయడానికి పోలీసు బలగాలను వినియోగించడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ద్వారా వారి గొంతును అణచివేయాలనే ప్రయత్నం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని రాంచందర్ రావు అన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం, నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగానికి దిగడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

ఈ ఘటనలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే లాఠీచార్జ్ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల హక్కులను కాపాడే విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థుల గొంతును అణచివేసే ఏ ప్రయత్నాన్నైనా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.