భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.
* 56.1 అడుగులకు నీటిమట్టం, బూర్గంపాడు జలదిగ్బంధం.
* లోతట్టు ప్రాంతాల్లో భారీ ముంపు.
* 250 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు.
* 1,500 ఎకరాల్లో పంటలు నీటమునుగు
హైదరాబాద్, మహా.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఏడాది అత్యధికంగా నీటిమట్టం 56.1 అడుగులకు చేరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
వరద తీవ్రత పెరగడంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బూర్గంపాడు మండలంలో సుమారు 250 మంది బాధితులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వసతి, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. వరద పరిస్థితిని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
గోదావరి ఉద్ధృతి కారణంగా పలు ప్రధాన రహదారులు వరద నీటిలో మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సారపాక–నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం–బూర్గంపాడు, మోతె పట్టినగర్–ఇరవెండి మార్గాలు నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా మూసుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బూర్గంపాడు శివారులోని కొల్లు ప్రాంతం సమీపంలో నాలుగు లారీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సమయస్ఫూర్తితో స్పందించి లారీ డ్రైవర్లు, క్లీనర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వరద ప్రభావం రైతాంగంపై తీవ్రంగా పడింది. బూర్గంపాడు మండలంలో దాదాపు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇప్పటికే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా సాగు ఆలస్యమై నష్టపోయిన రైతులు, ఇప్పుడు గోదావరి వరదలతో మరోసారి తీవ్ర దెబ్బతిన్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలు, రైతులు ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం ప్రకటించాలని, పునరావాసంతో పాటు పునర్నిర్మాణ చర్యలు కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గోదావరి ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.







