**కలలు కల్లలాయె.. నిరీక్షణ నిరాశాయె..
* ఆసుపత్రి పడకపై ప్రాణాలతో నిరుద్యోగి పోరాటం!
* ప్రభుత్వ నిర్లక్ష్యానికి సమిధగా మారుతున్న యువత.
* కన్నీళ్లు పెట్టిస్తున్న వేణు సూసైడ్ నోట్.
ఖమ్మం, మహా.
అక్షరాలతో అద్భుతాలు సృష్టించి, పరీక్షలు రాసి జీవితాన్ని గెలవాల్సిన ఆ యువకుడి కలం.. తన చావుకు కారణాలను వివరిస్తూ కన్నీటి సిరాతో సూసైడ్ నోట్ రాసింది. ప్రభుత్వ కొలువు కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి, వయసు కరిగిపోతుంటే తట్టుకోలేక ఆ గుండె ఆగిపోవాలనుకుంది. కటిక పేదరికం ఒకవైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు ఆ నిరుద్యోగి పీకల మీద కత్తిపెట్టాయి. ఆసుపత్రి పడకపై ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడి పేరు గడ్డం వేణు కుమార్. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం అతడి స్వగ్రామం. నిరుద్యోగపు మహాసముద్రంలో ఈదులాడలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణు రాసిన లేఖ ఇప్పుడు యావత్ రాష్ట్రంలోని పౌరులందరి చేతా కన్నీరు పెట్టిస్తోంది.
“నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడమే” అంటూ వేణు రాసిన ప్రతి అక్షరం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల మూగవేదనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గత ఐదేళ్లుగా గ్రూప్స్ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న ఆ యువకుడు, ఈ సుదీర్ఘ కాలంలో రాసింది కేవలం ఒక్క పరీక్ష మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తుందని, తమ బతుకులు మారతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. పంచవర్ష ప్రణాళికల్లా పదేళ్లకు ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తే, అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని, వయస్సును ఎలా కోల్పోతున్నారో వివరిస్తూ తన లేఖ ద్వారా పాలకులకే పాఠం చెప్పే ప్రయత్నం చేశాడు. చదువుకునే వయసులో ఒక అభ్యర్థి తన జీవిత కాలంలో కేవలం ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు మాత్రమే చూడగలుగుతున్నాడన్న వేణు మాటలు వ్యవస్థ డొల్లతనాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి.
వేణు నేపథ్యం చూస్తే బండరాయికైనా కన్నీరు జలజలా రాలాల్సిందే. రాష్ట్రంలో పైస్థాయిలో మార్పులు వస్తున్నాయని చెబుతున్నా, కిందిస్థాయిలో పేదలకు ఏమీ అందడం లేదనడానికి అతడి బతుకే అతిపెద్ద ఉదాహరణ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉంటూ, కనీసం తలదాచుకోవడానికి సొంత ఇల్లు కూడా లేక పదేళ్లుగా ఆ కుటుంబం నరకం అనుభవిస్తోంది. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా ఆ కల నెరవేరలేదు. దానికి తోడు సొంత అక్క మానసిక వైకల్యంతో బాధపడుతుండటం ఆ యువకుడిని మరింత కుంగదీసింది. ఒకవైపు గుండెను పిండేసే కుటుంబ భారం, మరోవైపు ఎప్పటికి తీరుతుందో తెలియని నిరుద్యోగం.. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ యువకుడు ప్రాణాలు తీసుకోవడమే శరణ్యమని భావించాడు.
చావు అంచుల దాకా వెళ్లినా ఆ యువకుడిలో సామాజిక బాధ్యత చావలేదు. ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ ఇవ్వొచ్చని, తద్వారా నిరుద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందని ఆఖరి క్షణాల్లోనూ ఓ అద్భుతమైన సూచన చేశాడు. తన మరణవార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లాలని, సోషల్ మీడియా తన ఆవేదనను పాలకులకు చేరవేసే బాధ్యత తీసుకోవాలని చేతులెత్తి వేడుకున్నాడు. “ఆగుతుందా నిరుద్యోగి మంట.. విస్ఫోటమై ఎగిసిపడుతుందా ప్రభుత్వం గుండెల నిండా..” అంటూ అతడు రాసిన కవిత చదువుతుంటే ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది. “కదిలే కలం వేణు.. కదిలించే వయసు నా కవిత్వం.. కానీ ఈ కలం ఇక కదలటం ఆగిపోతుంది” అంటూ ముగించిన వాక్యాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వేణు ప్రాణాలతో తిరిగి రావాలని, అతడి కలం మళ్లీ కదలాలని, ఈ ఘటనతోనైనా పాలకుల కళ్లు తెరుచుకోవాలని యావత్ సమాజం కన్నీటి ప్రార్థనలు చేస్తోంది.







