- లక్ష్మీపురం మార్కెట్ లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరచాలి
- చెత్తను సకాలంలో తరలించి, ఫాగింగ్, డ్రైనేజీ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి*
- జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న*
వరంగల్, కార్పొరేషన్ మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని లక్ష్మీపురం మార్కెట్ ను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచడానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అలాగే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.
బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక తో కలిసి కమిషనర్ లక్ష్మీపురం మార్కెట్‌ను సందర్శించి పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ పరిధిలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను ఆలస్యం లేకుండా సకాలంలో తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలించడంలో జాప్యం ఏర్పడుతున్న నేపథ్యంలో, చెత్తను ముందుగా బాలసముద్రం ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి శాస్త్రీయ పద్ధతిలో తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు.
మార్కెట్ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడకుండా ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రధాన మురుగు కాలువలు, డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేస్తూ వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్‌వెజ్ మార్కెట్‌ను కమిషనర్ పరిశీలించారు. మార్కెట్‌లో వ్యాపారులు, వినియోగదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ వో , ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీహెచ్‌వో లక్ష్మారెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేష్ , సంబంధిత అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







