ఇరాన్ యుద్ధంతో అమెరికా క్షిపణి నిల్వలు తగ్గాయా?
* థాడ్, పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ల వినియోగం పెరిగిందన్న సీఎన్‌ఎన్ కథనం.
వాషింగ్టన్, మహా
ఇరాన్‌తో నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా థాడ్ , పేట్రియట్ వంటి అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలకు ఉపయోగించే ఇంటర్‌సెప్టార్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్ కథనం వెల్లడించింది.
సీఎన్‌ఎన్ నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న నిల్వలతో పోలిస్తే అమెరికా థాడ్ ఇంటర్‌సెప్టార్ క్షిపణుల్లో దాదాపు 80 శాతం, పేట్రియట్ ఇంటర్‌సెప్టార్‌లలో సుమారు 50 శాతం వరకు వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా సైన్యం పెద్ద ఎత్తున ఈ రక్షణ వ్యవస్థలను ఉపయోగించిందని కథనంలో వెల్లడించింది.
దీని ఫలితంగా అమెరికా వద్ద ఉన్న క్షిపణి రక్షణ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, భవిష్యత్తులో మరో భారీ సైనిక ఘర్షణ తలెత్తితే అవసరమైన ఇంటర్‌సెప్టార్‌ల కొరత ఏర్పడే అవకాశముందని విశ్లేషించింది. థాడ్, పేట్రియట్ వ్యవస్థలతో పాటు దీర్ఘశ్రేణి ఖచ్చితత్వ క్షిపణులు, టొమహాక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది.
గత వారం ఇరాన్‌పై ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన భారీ సైనిక దాడిని అమెరికా వాయిదా వేయడానికి ఆయుధ నిల్వలు తగ్గిపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని సీఎన్‌ఎన్ తన కథనంలో వెల్లడించింది.
అయితే ఈ వార్తలను అమెరికా రక్షణ శాఖ పూర్తిగా ఖండించింది. తమ సైనిక సామర్థ్యానికి ఎలాంటి ముప్పు లేదని, అవసరమైన అన్ని రకాల క్షిపణులు, రక్షణ ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేసింది. దేశ భద్రతకు అవసరమైన ఆయుధ నిల్వలు తగిన స్థాయిలోనే ఉన్నాయని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం అమెరికా సైన్యానికి ఉందని రక్షణ శాఖ పేర్కొంది.








