రాజస్థాన్–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.
• రెండు కేసుల్లో ఏడుగురి అరెస్ట్.
• 1.031 కిలోల ఓపియం, 25 గ్రాముల ఎండీ స్వాధీనం.
హైదరాబాద్, మహా.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. వారి నుంచి 1.031 కిలోల ఓపియం, 25 గ్రాముల మెఫెడ్రోన్ (ఎండీ)ని స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్‌ను కేంద్రంగా చేసుకుని హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ నెట్‌వర్క్‌లో సప్లయర్లు, మధ్యవర్తులు, కొరియర్లు, డెలివరీ ఏజెంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ప్రైవేట్ బస్సులు, రైళ్లు, కార్లను ఉపయోగించి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ లావాదేవీల కోసం డిజిటల్ కమ్యూనికేషన్‌తో పాటు యూపీఐ లావాదేవీలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
2023 నుంచి రాజస్థాన్‌తో సంబంధం ఉన్న 78 డ్రగ్స్ ట్రాఫికింగ్ ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌లలో యువతను కొరియర్లు, డెలివరీ ఏజెంట్లుగా ఉపయోగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. రాజస్థాన్ లింక్ ఉన్న కేసుల్లో తరచుగా ఎండీ, ఓపియం, డోడా చూరా వంటి మాదకద్రవ్యాలను గుర్తించినట్లు తెలిపారు.
మియాపూర్ కేసులో రాజస్థాన్‌కు చెందిన మహేందర్ కుమావత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలను తరలించినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ రవాణాకు ఎంఆర్ ట్రావెల్స్ డ్రైవర్‌ను కూడా వినియోగించినట్లు తెలిపారు.
నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, నగదు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి తెలంగాణకు మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్, ప్రధాన సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలపై ఈగల్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







