- లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- కార్మిక హక్కులను కాపాడాలి
- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐఎన్ టీయూసీ జైల్ భరో
- పలువురు అరెస్ట్
హైదరాబాద్, మహా : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా ఐ ఎన్ టీయూసీ అధ్యక్షులు జి. సంజీవరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, వివిధ అనుబంధ కార్మిక సంఘాల నేతలు, కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్మికులకు అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించిన హక్కులను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని నాయకులు ఆరోపించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత, పని గంటలు, ట్రేడ్ యూనియన్ల హక్కులు తదితర అంశాల్లో కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ ఉంచారు.






