Mahaa Daily Exclusive

  పోలవరానికి కేంద్రం భరోసా..! పునరావాసంలో 17,892 కుటుంబాల తరలింపు..

Share

  • పోలవరానికి కేంద్రం భరోసా.
  • గడువు పొడిగింపునకు అవకాశం
  •  రూ.12,620 కోట్ల నిధులు విడుదల.
  • పునరావాసంలో 17,892 కుటుంబాల తరలింపు.

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక వివరాలను వెల్లడించింది. ప్రాజెక్టు తొలి దశను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరాన్ని బట్టి మరో ఏడాది గడువు పొడిగించే వెసులుబాటు ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.12,620.53 కోట్లను విడుదల చేసినట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌ భూషణ్‌ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

2023 ధరల సూచీ ఆధారంగా పోలవరం తొలి దశకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. ప్రాజెక్టు తొలి దశలో +41.15 మీటర్ల నీటి మట్టం వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో మిగిలిన కేంద్ర సహాయ నిధుల కింద రూ.12,157.53 కోట్లను కేటాయించినట్లు కేంద్రం వివరించింది. నిధుల విడుదల, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యాల మేరకు ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది.

నిర్మాణ పనులు తుది దశకు

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే, ఎర్త్‌-కమ్‌-రాక్‌ఫిల్‌ డ్యామ్, ప్రధాన కాలువల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్‌వేకు సంబంధించిన మట్టి పనులు, కాంక్రీట్‌, ఉక్కు పనులు గణనీయంగా పూర్తయ్యాయి. ఎర్త్‌-కమ్‌-రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కూడా దాదాపు 75 నుంచి 81 శాతం మేర పూర్తయినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. ప్రధాన కాలువల పనులు సైతం పురోగతిలో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విస్తారమైన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు మార్గం సుగమం కానుంది. అందుకే నిర్మాణ పనుల వేగంతోపాటు పునరావాస ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయడం అత్యంత కీలకంగా మారింది.

96,660 కుటుంబాలపై ప్రభావం

పోలవరం నిర్మాణం కారణంగా మొత్తం 96,660 కుటుంబాలు నిర్వాసితులవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. తొలి దశ పరిధిలో ఇప్పటివరకు 17,892 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించినట్లు తెలిపింది. నిర్వాసితులకు పరిహారం, ఇతర నగదు ప్రయోజనాల కింద రూ.1,373.01 కోట్లు చెల్లించినట్లు వివరించింది. పునరావాసం, పునరావాస కాలనీలకు సంబంధించిన పనుల కోసం అదనంగా రూ.1,581.08 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం పేర్కొంది.

నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంలో మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినంత మాత్రాన ప్రయోజనాలు అందవు.. ముంపు ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయి పునరావాసం, పరిహారం, జీవనోపాధి పునరుద్ధరణ కూడా సమాన ప్రాధాన్యం పొందాల్సి ఉంటుంది.

గడువు పొడిగింపుపై స్పష్టత

పోలవరం తొలి దశ పూర్తికి 2026 మార్చి గడువుగా నిర్ణయించినప్పటికీ, అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉన్నట్లు కేంద్రం పేర్కొనడం ప్రాజెక్టు కాలపరిమితిపై కీలకమైన స్పష్టతనిచ్చింది. భారీ స్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనులు, మిగిలిన పునరావాస ప్రక్రియ, సాంకేతిక పనుల నేపథ్యంలో గడువు పొడిగింపు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు గత ఐదేళ్లలో రూ.12 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు విడుదల కావడం ప్రాజెక్టుపై కేంద్రం చూపుతున్న ఆర్థిక నిబద్ధతకు సంకేతమని అధికారులు చెబుతున్నారు. సవరించిన వ్యయ అంచనాలకు ఆమోదం లభించడం, మిగిలిన నిధులపై స్పష్టత ఇవ్వడం వల్ల నిర్మాణ పనులకు ఆర్థికపరమైన వెసులుబాటు ఏర్పడినట్లు భావిస్తున్నారు.

తొలి దశ పూర్తే కీలకం

పోలవరం తొలి దశలో నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టు తదుపరి దశల నిర్మాణానికి కూడా మార్గం సుగమం కానుంది. స్పిల్‌వే, డ్యామ్‌, కాలువల నిర్మాణంతోపాటు పునరావాస ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.

కేంద్రం రాజ్యసభలో వెల్లడించిన తాజా గణాంకాలు చూస్తే.. పోలవరం నిర్మాణం, నిధుల సమీకరణ, పునరావాసం మూడు అంశాల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశకు గడువు, నిధులపై కేంద్రం ఇచ్చిన స్పష్టతతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై కొంతమేర అవగాహన ఏర్పడింది. ఇక మిగిలిన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతోపాటు నిర్వాసితులందరికీ సకాలంలో న్యాయం చేసి.. పోలవరం ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే అసలు పరీక్షగా మారింది.

Latest