Mahaa Daily Exclusive

  దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

Share

  • దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
  • 32 నెలల మా పాలనా ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి
  • తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే 92 శాతం అధికం
  • గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
  • జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, మహా : గోల్కొండ కోట వేదికగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ 32 నెలల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని వివరించారు. ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 92 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు పండుగగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ. 36 వేల కోట్లు రైతులకు అందించినట్లు తెలిపారు. మొత్తంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ సరికొత్త రికార్డులను అధిగమిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంతోపాటు నివాస గృహాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌, సాగునీరు, రైతు పెట్టుబడి సాయం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఉన్నాయని వివరించారు.

మహిళలు, ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా సీఎం ప్రస్తావించారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందించినట్లు తెలిపారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి వర్గాన్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా పాలన సాగించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ సంక్షేమాన్ని విస్తరించామన్నారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్య్ర పోరాటమని అభివర్ణించారు. అహింసతో విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని తెలిపారు. ఈ క్రమంలోనే పేదవాడి పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యతగా ఉందన్న రేవంత్ రెడ్డి, వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఓట్ల కోసమో, మొక్కుబడి హామీలుగానో సంక్షేమాన్ని చూడటం లేదన్న సీఎం, ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉందని వెల్లడించారు.

నీళ్ల విషయంలో రాజీపడేదే లేదు

రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని, త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించనున్నామని తెలిపారు. వ్యవసాయంతో పాటు నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. “దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన పూర్తయ్యింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని కేంద్రం కూడా కులగణన చేపట్టింది. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చింది. దేశంలోనే తొలిసారిగా గిగ్‌ కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేశాం. సినీ కార్మికుల సంక్షేమం కోసం కూడా త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నామని, మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని గుర్తు చేశారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, రెండో విడతలో 5.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ఏడాది పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని వెల్లడించారు. కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ఆన్‌లైన్‌ విధానంలో ప్రజావాణి

ఈ నెల 17 నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తామన్న సీఎం, ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఆన్‌లైన్‌ విధానంలో ప్రజావాణి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు, దరఖాస్తులు ఇవ్వొచ్చని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములు రక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, చెరువులను ప్రక్షాళన చేసి నైట్‌ ఎకానమీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. మరో 78 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయని, హైదరాబాద్​ నగరంలో ఇప్పటికే 355కు పైగా జీసీసీలు పని చేస్తున్నాయని, గత 6 నెలల్లోనే హైదరాబాద్‌లో 40 జీసీసీలు ఏర్పాటయ్యాయని వివరించారు. అమెజాన్ సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతోందని స్పష్టం చేశారు.

విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇస్తున్నాయని, విద్యా సూచీలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ 14కు చేరుకుందని, నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టామని, వందకు పైగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ నిర్మించే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్‌ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలో జరిగే ఖేలో ఇండియా పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తుందని, విద్య, వైద్యం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని చెప్పారు. ఇప్పటికే ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణంలో ఉందని, 8 కొత్త మెడికల్‌ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

Latest