- మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందాలి
- ఆ క్రెడిట్ విపక్షాలే తీసుకోవాలి
- ఎర్రకోట నుంచి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
- విధానాల అమలులో మహిళా నాయకత్వం అత్యంత అవసరం
- సప్తదార పేరుతో సరికొత్త నినాదం
- జన్ జీకి అధిక ప్రాధాన్యమని వెల్లడి
న్యూడిల్లీ, మహా : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం దేశ ప్రగతికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దాని క్రెడిట్‌ను కూడా విపక్షాలే తీసుకోవచ్చని అన్నారు. దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మహిళా రిజర్వేషన్లపై మాట్లాడారు. దేశ విధానాలను రూపొందించడంలో మహిళా నాయకత్వం అత్యంత అవసరమని మోదీ అన్నారు. పంచాయతీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళా ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. వారి నాయకత్వం ప్రజలకు సాధికారత కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ‘నారీ శక్తి వందన అధినియమ్’ను ఆమోదించినట్లు ప్రధాని గుర్తుచేశారు. అయితే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రయత్నం గత 40 ఏళ్లుగా ఏదో ఒక కారణంతో రాజకీయ వివాదాలకు బలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నారీ శక్తి వందన్ అధినియమ్-2023’ అమలు ప్రక్రియ ముందుకు సాగలేదని, ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు రాజ్యాంగపరంగా అవసరమైన ‘సభకు హాజరై, ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ’ లభించకపోవడంతో ఆ బిల్లు వీగిపోయిందని దగుర్తు చేసారు. ఈ బిల్లు శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడాన్ని ప్రతిపాదించిందని ప్రధాని పేర్కొన్నారు.
అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం
గత కొన్నేళ్లుగా దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉక్రెయిన్, పశ్చిమాసియాలో యుద్ధాలు చెలరేగాయని, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. “గత 21 ఏళ్లలో మనం ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాం. కోవిడ్ నుంచి బయటపడిన వెంటనే ఉక్రెయిన్, పశ్చిమాసియా నుంచి యుద్ధాలు చెలరేగుతున్నాయన్న వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భవిష్యవాదులు ఎలాంటి అంచనాలు వేశారో దేవుడికే తెలియాలి” అని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంక్షోభాల మధ్య కూడా ప్రజా కేంద్రిత విధానాలతో దేశం ముందుకు సాగిందని ప్రధాని తెలిపారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షోభాలను అధిగమించడంలో సహాయపడ్డాయని చెప్పారు.
అంతిమ దశకు చేరుకున్న మావోయిస్టు తీవ్రవాదం
ఇదిలా ఉండగా దేశంలో మావోయిస్ట్ తీవ్రవాదం అంతిమ దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నక్సలిజం వల్ల ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనమైందని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు దేశాన్ని నక్సల్స్ నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశామని, ఇప్పుడు అనేక ప్రాంతాలు నక్సల్స్ నుంచి విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే సాయుధ నక్సల్స్‌ను ఎదుర్కోవడంలో విజయం సాధించినప్పటికీ, అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ‘ఇంటెలెక్చువల్ నక్సల్స్’ను గుర్తించి, వారిని వేరు చేయాలని పిలుపునిచ్చారు.
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలి
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి భారత్ బయటపడాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘లోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాలకు ప్రజలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశ అవసరాలను దేశీయంగానే తీర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంపూర్ణ జాతీయ అభివృద్ధి, స్వావలంబనను సాధించడానికి ఉద్దేశించిన సప్తధార (ఏడు ప్రవాహాలు) దార్శనికతను వివరించారు. అవి తయారీ రంగంలో శ్రేష్ఠత (ఖర్చు, నాణ్యత మరియు స్థాయి), వ్యవసాయం/ఆహార శుద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, గతిశక్తి అనుసంధానం, రక్షణ రంగంలో స్వావలంబన, హరిత, నీలి ఆర్థిక వ్యవస్థల దిశగా ప్రోత్సాహం, ప్రపంచ మృదుశక్తి (యోగా, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం మరియు సృజనాత్మక కళలు). ఈ సంస్కరణలలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.
2036 ఒలింపిక్స్ కోసం 5-15 ఏళ్ల వయస్సు గల పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్త ప్రతిభాన్వేషణను కూడా ఆయన ప్రకటించారు. కరోనాను జయించిన తర్వాత, ప్రతిచోటా సంఘర్షణ, యుద్ధం నెలకొన్నాయని ప్రధాని మోదీ చెబుతూ “ప్రజలు భయాందోళనలు సృష్టించడం మొదలుపెట్టారు. వ్యాక్సిన్లు ఉండవని, ఎవరూ ప్రాణాలతో బయటపడరని చాలామంది అన్నారు. ఎవరికీ ఇంధనం, డీజిల్, ఎరువులు అందవని చెప్పారు; ప్రజలు అన్ని రకాల పుకార్లను వ్యాప్తి చేశారు,. కొంతమంది ఈ భయాందోళనలను సృష్టించడంలో ఆనందం పొందారు” అంటూ విమర్శించారు. అయితే, “ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, మేము ‘నాగరిక్ దేవో భవ’ స్ఫూర్తిని అనుసరించాము, మా సన్నాహాలు మాకు సహాయపడ్డాయి,” అని ఆయన పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భరత’ లేదా స్వయం సమృద్ధి భావనపై దృష్టి సారిస్తూ “భారత్ ఇతరులపై ఆధారపడకూడదనే దృఢ నిశ్చయం మాకు ఉంది, మనం స్వయం సమృద్ధిని సాధించాలి. మన దేశంలోనే అన్నీ లభిస్తాయి. కాబట్టి, మనం మనల్ని మనం మెరుగుపరచుకుని, రక్షించుకోవాలి. అలాగే స్వదేశీ, స్వయం సమృద్ధి, ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత) కోసం సంకల్పం తీసుకోవాలి.” అని పిలుపునిచ్చారు.
ముడి చమురు విషయంలో భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడటం గురించి ప్రధాని మాట్లాడుతూ: “గతంలో మన సొంత ప్రాంతాల్లో అన్వేషణ జరపకూడదని నిర్ణయించుకోవడం వల్ల, మన తీరప్రాంతంలో 99% భాగం ‘నో-గో ఏరియా’ (ప్రవేశం లేని ప్రాంతం)గా ఉండేది. ఇది గతంలో ఆలోచనా విధానంలో ఉన్న లోపం. మేము దీనిని మార్చి, ఆ ప్రాంతాన్ని అన్వేషణకు అందుబాటులోకి తెచ్చాము. కొత్త చమురు నిల్వలను కనుగొనేందుకు సముద్రంలో అన్వేషణ సాగిస్తున్నాము” అని వివరించారు.
పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కోటి మంది యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కోచింగ్ కోసం కుటుంబాలు ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశంలో అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, నిపుణుల సేవలను ఒకే వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు. వీటి సమన్వయంతో యువతకు వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించే సంపూర్ణ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఖరీదైన కోచింగ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని భావిస్తున్నారు.
సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత్ కీలక అడుగులు వేస్తోందని చెప్పారు. ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశ ఇంధన భద్రతకు అణుశక్తి కీలకమని ప్రధాని పేర్కొంటూ 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలుత రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అలాగే, ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ‘వందేమాతరం’ గీతానికి సంబంధించిన 150వ వార్షికోత్సవానికి కూడా గుర్తుగా నిలుస్తాయి. దేశవ్యాప్తంగా ‘వందే మాతరం’ నినాదం మార్మోగుతోందని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని మోదీ తెలిపారు.







