వరంగల్, బ్యూరో మహా ;
వరంగల్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గతంలో రేషన్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆహార భద్రత వ్యవస్థను ఆధునీకరించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు.
గతంలో రేషన్ కార్డుల ద్వారా వేలు ముద్రలు పడకుండా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని, అలాంటి సమస్యను అధిగమించుటకు స్మార్ట్ రేషన్ కార్డును రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తం పంపిణీ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. ‘రేషన్ మొబైల్’ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబం మాత్రమే కార్డును స్వైప్ చేసే విధంగా వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది అని, ఆన్లైన్ ద్వారా రేషన్ అందుతున్న తీరును ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 29,772 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు అందులో లబ్దిదారులు 93825 ఉన్నారన్నారు.
జిల్లాలో మొత్తం 296929 రేషన్ కార్డులు ఉండగా, సుమారు 9 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. సంధ్యారాణి తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ వై.వి. గణేష్, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట, ఆర్డీఓ ఉమారాణి , రాష్ట్ర మేడ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం, గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, జిల్లా సివిల్ సప్లై అధికారి కిష్టయ్య, డీఎం సివిల్ సప్లైస్ సంధ్యారాణి, సంబంధిత తహసీల్దార్ ఇక్బాల్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మోహన్ నాయక్, అన్ని మండలాల నుండి అధ్యక్షులు మరియు రేషన్ డీలర్లు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








