- అరుమాయినాయగానికి ‘జీవిత సాఫల్య’ పురస్కారం
- చెస్ క్రీడాకారులు విధిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్‌లకు అర్జున అవార్డు
- తెలుగు తేజాలకు దక్కిన చోటు
- గాయత్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు
న్యూఢిల్లీ, మహా : క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి 17 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత నాలుగేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల పేర్లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, తుది జాబితాను ప్రకటించింది. 1962 ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ. అరుమాయినాయగానికి జీవిత సాఫల్య అవార్డు దక్కింది. క్రీడా రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డును ఈసారి ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.
చెస్ రంగంలో
ఈ పురస్కారానికి చెస్ విభాగంలో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోశ్ గుజరాతీని అవార్డు వరించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత్‌కు అద్భుత విజయాలను అందించడంలో విదిత్ సంతోశ్ కీలక పాత్ర పోషించారు. అలాగే, మహిళల విభాగంలో ఫిడే ప్రపంచ కప్‌లో అదరగొట్టిన దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ సైతం అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. భారత్‌లో చెస్ క్రీడకు లభిస్తున్న ఆదరణకు ఈ అవార్డులే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక, మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అంచలంచెలుగా ఎదుగుతున్న పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడికి సంయుక్తంగా ఈ గౌరవం దక్కింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కుమార్తె అయిన గాయత్రి, ట్రీసాతో కలిసి ప్రపంచ వేదికలపై కనబరిచిన ప్రతిభకు ఈ అవార్డు తగిన గుర్తింపుగా నిలిచింది. మరోవైపు, డెకాథ్లాన్, హైజంప్ విభాగంలో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన తేజస్విన్ శంకర్‌కు ఈ అవార్డు లభించింది. అలాగే రేస్ వాకింగ్‌లో దేశ కీర్తిని పెంచిన ప్రియాంక గోస్వామి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దూసుకుపోతున్న మహమ్మద్ అజ్మల్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో అవకాశం లభించింది. వీరితో పాటు నరేందర్ (బాక్సింగ్), లాల్రెమ్సియామి (హాకీ), రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్ (కబడ్డీ), పూజ (కబడ్డీ), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా-షూటింగ్), ఏక్తా భయన్ (పారా-షూటింగ్), అరవింద్ సింగ్ (రోయింగ్), అఖిల్ షెరాన్ (షూటింగ్) అవార్డులను అందుకోనున్నారు. ఈ ఏడాది అవార్డుల ఎంపికలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, షూటింగ్, హాకీ, కబడ్డీ వంటి వివిధ క్రీడలకు సమాన ప్రాధాన్యం లభించింది. యువ క్రీడాకారులతో పాటు సీనియర్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా పేర్లను ఎంపిక చేస్తారు. అయితే, వివిధ విభాగాల కింద క్రీడాకారులు, కోచ్‌లు సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.







