Mahaa Daily Exclusive

  ఐఈఈఈ వేదికపై హైదరాబాద్ యువ ప్రతిభ..

Share

  • వేద గణితంలో చిన్ననాటే జాతీయ అవార్డు
  • ఇప్పుడు హంగేరీలో అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్, మహా : పాఠశాల స్థాయిలోనే వేద గణితంలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన హైదరాబాద్ యువకుడు ప్రణీత్‌ ముక్కాల తాజాగా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో నిర్వహించిన 2026 ఐఈఈఈ టెక్నాలజీ సమ్మిట్ – ఎథికల్ ఏఐలో ప్రణీత్‌ రూపొందించిన ‘వేదిక్ మైండ్’ ప్రాజెక్ట్‌ ప్రపంచస్థాయి టాప్‌–5లో చోటు సంపాదించింది.

30 దేశాలు.. 115 దరఖాస్తులు

ఐఈఈఈ ఎంటర్ ప్యూనర్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ ఫౌండర్ షోకేస్ – ఐడేషన్ ట్రాక్ కు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి 115 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఎంపికైన ఐదు అత్యుత్తమ ప్రాజెక్టుల్లో వేదిక్ మైండ్ కు స్థానం లభించింది. దీంతో ప్రణీత్‌కు తన ఆలోచనను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సమక్షంలో ప్రదర్శించే అవకాశం దక్కింది.

స్కూల్‌ నుంచే వేద గణితంపై మక్కువ

ప్రణీత్‌ పాఠశాల స్థాయి నుంచే వేద గణితాన్ని నేర్చుకున్నారు. అందులో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అవార్డు సాధించారు. వేద గణితంపై ఉన్న ఆసక్తిని ఆధునిక సాంకేతికతతో మేళవించాలనే ఆలోచనతో ‘వేదిక్ మైండ్’ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ప్రణీత్‌ వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. చదువుతోపాటు ‘వేదిక్ మైండ్’ను మరింత అభివృద్ధి చేస్తున్నారు.

అందరికీ అందుబాటులోకి..

వేద గణితాన్ని విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా నేర్పించడమే ‘వేదిక్ మైండ్’ లక్ష్యమని ప్రణీత్‌ తెలిపారు. ఆధునిక సాంకేతికత, గేమిఫికేషన్‌ను ఉపయోగించి గణితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వేదిక్ మైండ్ వెబ్‌సైట్‌ను మరింత ఆధునీకరించి, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

యువతకు స్ఫూర్తి

పాఠశాల స్థాయిలో వేద గణితంలో జాతీయ అవార్డు నుంచి.. ఇంజినీరింగ్‌ విద్యార్థిగా అంతర్జాతీయ ఐఈఈఈ వేదికపై ప్రాజెక్ట్‌ ప్రదర్శించే స్థాయికి ప్రణీత్‌ చేరుకోవడం విశేషం. ఆయన సాధించిన ఈ గుర్తింపు హైదరాబాద్‌ యువతలోని సాంకేతిక ప్రతిభకు, సృజనాత్మక ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది.