న్యూఢిల్లీ, మహా : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని స్పష్టం చేసిన ధర్మాసనం ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నందున ఈ సమయంలో బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం పేర్కొంది. మెరిట్స్ ఆధారంగా కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కానీ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని తెలిపింది. విచారణ పూర్తయ్యే దశలో ఉన్నందున ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
విచారణలో మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. వారిలో చాలామంది సాక్షుల విచారణ ఇప్పటికే పూర్తయిందని, ట్రయల్ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణను త్వరితగతిన పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు విధించిన గడువును పొడిగించాలని ఆమె కోరారు. నవంబర్ 30లోగా విచారణ పూర్తి చేయాలన్న గత ఆదేశాలను పొడిగించే అంశంపై.. ట్రయల్ కోర్టు జడ్జి స్వయంగా లేఖ రాస్తే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రయల్ గడువు పొడిగించాలని కోరే హక్కు నిందితులకు లేదని ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ ప్రయత్నానికి సుప్రీంకోర్టు నుంచి అనుకూల నిర్ణయం రాలేదు. ఇటీవలే అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో ఈ కేసులో ఆయన బెయిల్ కోసం న్యాయపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.








