Mahaa Daily Exclusive

  హరీశ్‌రావు పై ఎఫ్ ఐ ఆర్..

Share

  • కేసీఆర్ ఫ్యామిలీ లో తొలి ఫోన్ ట్యాపింగ్ కేసు
  • పంజాగుట్ట పీఎస్‌లో కేసునమోదు
  • మాజీ డిసిపి రాధాకిషన్ రావు పై కూడా
  • రాష్ట్రంలో హాట్‌హాట్‌ చర్చ
  • త్వరలో మరికొందరు పెద్దలపై కూడా..
  • ఇటీవల ట్యాపింగ్ కేసు లో మాజీ ఎమ్మెల్యేలను విచారించిన అధికారులు

 

(హైదరాబాద్, మహా):

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ కీలక నేతలను పలు కేసులు చుట్టుముడుతున్నాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధానంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్‌గౌడ్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వేధింపులు మాత్రమే కాకుండా తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించాడు.

 

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదయింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదయింది. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీంతో, హరీశ్‌పై సెక్షన్లు 120(బీ), 386, 409, 506, రెడ్‌ విత్‌ 34, ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. హరీశ్‌ తో పాటు అప్పటి టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావుపై కూడా కేసు నమోదయింది.

 

తవ్విన కొద్దీ అక్రమాలే..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్విన కొద్దీ బీఆర్‌ఎస్‌ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇదే కేసులో పలువురు అధికారులు అరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు హరీశ్‌రావుపై కేసు నమోదు కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంకా చక్రధర్‌ గౌడ్‌ లాంటి బాధితులు ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సివుంది. రాధాకిషన్‌రావు, హరీశ్‌రావులపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు చక్రధర్‌. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో తాను చెక్‌ లు ఇచ్చానని, వారికి ఆదుకున్నానని గుర్తు చేశారాయన. ఆ సమయంలో తాను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేకాకుండా కేసులు పెట్టి జైలుకి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.

 

త్వరలో నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి నా కదలికలను ఎప్పటికప్పుడు రాధాకిషన్‌ రావు గుర్తించి హరీష్‌రావుకు సమాచారం ఇచ్చేవారని అందులో పేర్కొన్నారు. హరీశ్‌రావు వల్లే తాను సర్వం కోల్పోయాలని బయటపెట్టాడు. ఈ అంశంలో చక్రధర్‌ నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే రాధాకిషన్‌రావు జైలులో ఉండగా, రేపో మాపో హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా మరికొందరు పెద్ద లపై కూడా కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది.

……