- గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్
- ఆన్లైన్లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన
- ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
అమరావతి, మహా : గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు, సలహాలను సేకరించినట్లు తెలిపారు. ఈ భేటీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని ఆయా పార్టీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు. అయితే కుల, నివాస ధృవీకరణ పత్రాలు త్వరగా జారీ చేయాలన్నారు. మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని అన్ని పార్టీలకు సూచించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన
అభ్యర్థుల వివిధ సర్టిఫికెట్ల మంజూరు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్దేశిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, అది రాగానే తదుపరి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించబోమని క్లారిటీ ఇచ్చారు. ఆయా పార్టీలు వ్యక్తం చేసిన అన్ని అభిప్రాయాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు.








