Mahaa Daily Exclusive

  యూనిఫామ్ లో డ్యాన్స్ లొద్దు…

Share

  • యూనిఫామ్ లో డ్యాన్స్ లొద్దు
  • పోలీసుల రీల్స్‌పై డీజీపీ సీరియస్‌..
  • పోలీసు యూనిఫామ్‌ గౌరవం కాపాడాలి
  • ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, మహా : పోలీస్‌ యూనిఫామ్‌ ధరించి ప్రైవేటు కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడం, సోషల్‌ మీడియాలో రీల్స్ చేయ‌డంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరికలు జారీ చేశారు. యూనిఫామ్‌లో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించి అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల, కొంతమంది పోలీసు సిబ్బంది వివాహాలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫాం ధరించి డ్యాన్సులు చేస్తున్న వీడియోలను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇటువంటి వీడియోలు కొన్ని సందర్భాల్లో వైరల్‌గా మారాయి. ఈ ధోరణి, పోలీసు విభాగంలో ఉండాల్సిన క్రమశిక్షణ, యూనిఫామ్‌కు ఇవ్వాల్సిన గౌరవంపై చర్చకు దారితీస్తుంద‌ని డీజీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు.

పోలీసు యూనిఫాం అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదని, అది అధికారం, బాధ్యత, క్రమశిక్షణలకు ప్రతీక అని డీజీపీ పేర్కొన్నారు. ధరించినప్పుడు సిబ్బంది వృత్తిపరమైన హుందాతనాన్ని పాటించాలని డీజీపీ సూచించారు. యూనిఫామ్‌ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలోనే కాకుండా యూనిఫామ్‌ ధరించిన సందర్భాల్లోనూ పోలీసు శాఖ ప్రతిష్ఠను కాపాడాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అధికారిక సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయా అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.