Mahaa Daily Exclusive

  అరెస్టులతో సీజేపీ ఉద్యమం ఆగదు.

Share

  •  నిర్బంధాలు ఎన్ని చేసినా పోరాటం కొనసాగుతుంది.
  •  అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ స్పష్టీకరణ.

న్యూఢిల్లీ, మహా.

తమను అరెస్టు చేసినా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తాము చేపట్టిన ఉద్యమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన ఏ నాయకుడిని అరెస్టు చేసినా ప్రజా పోరాటం మరింత ముందుకు సాగుతుందని వారు తేల్చిచెప్పారు. ఇటీవల జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై అరెస్టై తీహార్ జైలులో గడిపి ఇటీవల విడుదలైన వీరు, తాజాగా శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎదుట విచారణ ముగించుకుని బయటకు వచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నాయకులు అరెస్టైతే ఉద్యమం ఎలా కొనసాగుతుందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వారు బదులిస్తూ.. అరెస్టుల వల్ల ఉద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు లేదా పోలీసులు తమను అరెస్టు చేయడం ద్వారా తమ ఉనికిని ప్రజలు మరింతగా తెలుసుకునేందుకు అవకాశం దొరికిందని, అలాగే దేశంలోని వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనేదానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. తాము ఎవరికీ నాయకులం కాదని, దేశ ప్రజలు తమకు అందించిన వ్యవస్థకు కేవలం సంరక్షులం మాత్రమేనని వారు పేర్కొన్నారు. తమ వల్ల సాధ్యమైనంత మంచి చేయాలన్నదే తమ ఏకైక తాపత్రయమని వివరించారు. తాము కానీ, తమ పార్టీ నేతలు కానీ జైలులో ఉన్నా లేదా బయట ఉన్నా ప్రజా ప్రయోజనాల కోసం చేసే పోరాటం మాత్రం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా డిమాండ్ చేస్తూ గతంలో సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అక్టోబర్ 13న రాంకా, దాస్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారు దాదాపు వారం రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. గడచిన బుధవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయగా వారు విడుదలయ్యారు. అయితే అదే రోజు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరికీ మరో కేసుకు సంబంధించి తిరిగి నోటీసులు జారీ చేయడంతో, తాజాగా వారు విచారణకు హాజరైనట్లు వెల్లడించారు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.