Mahaa Daily Exclusive

  తెలంగాణలో జనసేన కదనభేరి….

Share

తెలంగాణలో జనసేన కదనభేరి.
* ప్రచార రథాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.
* వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలో జనసేన.. అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు.
* ఎమ్మెల్సీ ఎన్నికలతో పార్టీ బలోపేతానికి వ్యూహం

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పట్టు సాధించే దిశగా జనసేన పార్టీ అడుగులు వేగవంతం చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు సమరశంఖం పూరించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల ప్రచారానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మణికొండలోని పార్టీ నూతన కార్యాలయంలో ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ పేరిట రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించి, ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు.

ప్రచార రథం ప్రారంభం.. బరిలో గడల శ్రీనివాసరావు.

హైదరాబాద్‌లోని మణికొండ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వాహనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రచార రథం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులకు చేరువయ్యేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాహన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతును తెలియజేశారు.

తెలంగాణలో సంస్థాగత నిర్మాణంపై ఫోకస్.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో పాటు తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ వ్యూహంలో భాగమే. కాగా, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు యువకులు, రాష్ట్రస్థాయి క్రీడాకారులు పెద్ద ఎత్తున జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ వారికి స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో తెలంగాణ అంతటా సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేనాని అడుగులు వేస్తున్నట్లు ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.