- తాటాకు చప్పుళ్లకు భయపడం
- ఓట్ల చోరీ జరగలేదు.. దొంగలకు ప్రజలు ఓట్లేయడం లేదు
- కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయి
- పది నెలల్లో మోదీ సర్కార్ పడిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు
- ప్రపంచ శక్తులు ఏకమైనా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గరం గరం
హైదరాబాద్, మహా : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలను ఆయన “తాటాకు చప్పుళ్లు”గా అభివర్ణించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, దేశంలో అరాచకాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని విపక్షాలు పగటి కలలు కంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. “పది నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోతుంది” అంటూ కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ఇది ప్రజాతీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాదరణతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
“ప్రధానిగా నరేంద్ర మోదీ 2029 వరకు కొనసాగాలని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. అయితే, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రభుత్వాలను మార్చినట్లుగా ఇక్కడ కూడా చేయాలని ప్రతిపక్షాలు దింపుడుకల్లం ఆశలతో ఉన్నాయి. వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవు” అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ, ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం స్థిరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసే తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదని, తమ ప్రభుత్వం అత్యంత స్థిరంగా ఉందని, పూర్తికాలం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అజిత్ దోవల్ ను రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం
దేశ భద్రతను కాపాడుతూ దేశ ప్రజల, యువత హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కిషన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు రాజకీయాలకు, ప్రధానమంత్రులకు అతీతంగా దేశం కోసం శ్రమించిన నిస్వార్థ దేశభక్తుడు అజిత్ దోవల్ అని, ఆయన పేరు చెబితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు. అలాంటి విశిష్ట వ్యక్తిని అభినందించడం చేతకాకపోతే గౌరవంగా తప్పుకోవాలి తప్ప, ఒక రాజకీయ నాయకుడిపై మాట్లాడినట్లు విమర్శలు గుప్పిస్తే ఈ దేశ యువత రాహుల్ గాంధీని ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వ్యవహారశైలి అత్యంత బాధ్యతారాహిత్యంగా తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నత పోలీసు అధికారులు, సీబీఐ, ఈడీ, విదేశాంగ శాఖల అధికారులు తనకు టచ్‌లో ఉండి సమాచారం లీక్ చేస్తున్నారని రాహుల్ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు పెంచుకోవడం గౌరవప్రదమని, కాని ప్రభుత్వ అధికారులతో మాట్లాడే సంస్కృతి, సోయి రాహుల్ గాంధీకి ఎన్నడూ లేదని దుయ్యబట్టారు. దేశ భద్రత, విదేశాంగ అంశాలు తనకు లీక్ అవుతున్నాయని బహిరంగంగా ప్రచారం చేసుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని, ఇలాంటి చౌకబారు ప్రకటనలు సరికావన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన, బలహీనమైన ‘ఫేక్ ప్రతిపక్ష నేత’ను దేశం ఎన్నడూ చూడలేదని విమర్శించారు. నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, కాంగ్రెస్‌తో ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం పీవీ నరసింహారావు గారి ప్రభుత్వ హయాంలో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన సంప్రదాయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ చరిత్ర చదివి ఇలాంటి విలువలు నేర్చుకోవాలని హితవు పలికారు.
జ్ఞానేష్ కుమార్ పై దాదాగిరి మాటలా…
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బెదిరిస్తూ రాహుల్ గాంధీ దాదాగిరి భాష మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. “ప్రజలు మీకు ఓట్లు వేయకపోతే ఎన్నికల కమిషనర్ బాధ్యుడా? తమిళనాడులోనో, కేరళంలోనో..ఇలా ఎక్కడైనా బీజేపీ ఓడిపోతే మేమూ ఇలాగే దాదాగిరి భాష మాట్లాడాలా? అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ బెస్ట్ అని, కేరళంలో ఎన్నికలు గెలిస్తే ఎస్ఐఆర్ మంచిదని సర్టిఫికెట్లు ఇచ్చే కాంగ్రెస్.. బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ తప్పని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఓట్ల చోరీ ఎక్కడా జరగలేదని, “చోరోం కూ జనతా ఓట్ నహీ దేరహీ” (దొంగలకు ప్రజలు ఓటు వేయడం లేదు) అన్న వాస్తవాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని చురకలంటించారు.
తెలంగాణలో అరెస్టు చేయించిన సీఎం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ.. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్, జీవో 22ఏ సమస్యలపై పోరాడాలన్నా బీజేపీ కార్యకర్తలను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని వారంలో ఐదుసార్లు అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా నిర్బంధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు ఏడాదిన్నర పాటు నిరసనలు చేపడితే తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ఇక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, బీజేపీ కార్యాలయాల నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధాలు చేస్తూ.. ఢిల్లీకి పోయి రాజ్యాంగ పరిరక్షణ అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చే పెద్ద పెద్ద ఉపన్యాసాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు.
భారతదేశ అభివృద్ధిని, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పెరుగుతున్న దేశ ప్రతిష్టను జీర్ణించుకోలేక అంతర్జాతీయ పెట్టుబడిదారీ శక్తులు, డీప్ స్టేట్ మీడియా, విదేశీ శక్తులు, దేశీయ విద్రోహ శక్తులు ఏకమై పెద్ద కుట్రకు తెరలేపాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. భారత్ ఎప్పటికీ ప్రపంచం ముందు అప్పుల కోసం చేతులు చాచాలని, తమ కనుసన్నల్లోనే నడవాలని కోరుకునే శక్తులు ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించేందుకు యత్నిస్తున్నాయన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు విద్యార్థులకు పంపిణీ చేసి అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నారని ఆధారాలతో వివరించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐఎల్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ భారతదేశ జీడీపీ వృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని వేనోళ్ల కొనియాడుతుంటే కొందరికి కంటగింపుగా మారిందన్నారు. ప్రపంచ శక్తులన్నీ ఒక్కటైనా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వెంట్రుక కూడా పీకలేవని స్పష్టం చేశారు.
2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో ఎస్ఐఆర్ తో సంబంధం లేకుండానే కేవలం ప్రజాదరణతోనే మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రవేశపెట్టకముందే కాంగ్రెస్ లెక్కలేనన్ని రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. కేరళంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల మాట్లాడుతూ.. సీపీఎం చేసిన లక్షలాది దొంగ ఓట్లను ఎస్ఐఆర్ ద్వారా తొలగించడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని స్వయంగా ఒప్పుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. సొంత పార్టీ నేతల మాటలకే పొంతన లేకుండా మాట్లాడుతూ, వ్యవస్థలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళలతో సహా యావత్ దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు.







