Mahaa Daily Exclusive

  కడపలో పలుచోట్ల ఉద్రిక్తత…

Share

  • కడపలో పలుచోట్ల ఉద్రిక్తత
  • నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. రాళ్లదాడి
  • రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ

కడప, మహా : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు కొనసాగిన నేపథ్యంలో కడప నగరంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదాలు తలెత్తి ఘర్షణలకు దారితీశాయి. కాగితాలపెంట నామినేషన్‌ కేంద్రం వద్ద ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీనగర్‌ పాఠశాల వద్ద ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు నాగరాజుపేట, సెయింట్‌ జోసెఫ్‌ నామినేషన్‌ కేంద్రాల వద్ద కూడా ఇరువర్గాలు ఘర్షణకు దిగినట్లు సమాచారం.

వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా నాయకులు రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషాలను అదుపులోకి తీసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు!

స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.