- సీఈసీని రక్షించేందుకు మోడీ సర్కార్ యత్నం
- ఎన్నికల జాబితా నుంచి 13 కోట్ల ఓట్లు తొలగించారని అభిజిత్ దీప్కే విమర్శ
- ప్రభుత్వానిది ‘ఒకే దేశం, ఒకే పార్టీ’ నినాదమని విమర్శలు
- మ్ముంటే ఎమర్జన్సీ విధించండని సవాల్
- నటుడు ప్రకాశ్ రాజ్, ఇతర నేతలతో కలిసి దీప్కే మీడియా సమావేశం
న్యూఢిల్లీ, మహా : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేత అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను రక్షించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలు, నిరసనకారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని గురువారం ఆరోపించారు. ఢిల్లీలో నటుడు ప్రకాశ్ రాజ్, మరో నేత నేహా బోరాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభిజిత్ దీప్కే మాట్లాడారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. “ఒక్క జ్ఞానేశ్ కుమార్ను కాపాడటం కోసం ఢిల్లీ యువత వీధుల్లో పోరాడుతుంటే వారిని ఈడ్చుకెళుతున్నారు. సొంత పౌరుల మీదనే ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. సీఈసీని రక్షించడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు?” అని దీప్కే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపణ
ఎన్నికల కమిషన్ తీరును, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దీప్కే తీవ్రంగా తప్పుబట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమేనని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి సహాయం చేస్తున్నారని ప్రజలు ఎందుకు అనుమానించకూడదని ప్రశ్నించారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించిందని దీప్కే సంచలన ఆరోపణ చేశారు. ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించబడిన కొందరు వ్యక్తులను తాను కలిశానని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం తన పూర్తి యంత్రాంగాన్ని ఉపయోగించి జ్ఞానేశ్ కుమార్ను కాపాడుతోందని విమర్శించారు.
‘ఒకే దేశం, ఒకే పార్టీ’ అజెండా
ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమేనని, దాని వెనుక ఉన్న అసలు అజెండా ‘ఒకే దేశం, ఒకే పార్టీ’ అని దీప్కే విమర్శించారు. దమ్ముంటే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోనని ప్రధాని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.






