Mahaa Daily Exclusive

  అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పులకు కుట్ర…

Share

  • అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పులకు కుట్ర
  • భారతీయులే లక్ష్యంగా జాత్యహంకార దాడికి పథకం
  • 19 ఏళ్ల యువకుడి అరెస్టు
  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్‌

న్యూఢిల్లీ, మహా : అమెరికాలోని హిందూ ఆలయంపై కాల్పులు జరిపి, పెద్ద సంఖ్యలో ప్రజలను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని చికాగో సమీపంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. భారతీయ సంతతికి చెందిన ప్రజలపై హింసకు పాల్పడాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేసే పేపర్స్‌ నిందితుడికి సంబంధించినవిగా గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకార ధోరణులు, భారత వ్యతిరేక విద్వేషంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

అమెరికాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్ర ఆందోళనకరమైనదిగా అభివర్ణించింది. ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన ప్రజలపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటం మరింత కలవరపెడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. అమెరికాలోని అరోరా ప్రాంతంలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర జరిగినట్లు వచ్చిన నివేదికలను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. ఈ కుట్రలో హిందూ వ్యతిరేక, జాత్యహంకార ధోరణులు కనిపించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరింది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది.