Mahaa Daily Exclusive

  దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం

Share

  • ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అపశృతి
  • లైటింగ్‌ సిస్టమ్‌ కూలిపడి విద్యార్థిని మృతి
  •  మరో 25 మందికిపైగా విద్యార్థులకు గాయాలు
  • విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా, మహా : రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో దాండియా వేడుకలో విషాదం చోటుచేసుకుంది. లైటింగ్‌ సిస్టమ్‌ కూలిపడి విద్యార్థిని మృతి చెందింది. 25 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. నాదర్‌గుల్‌ లోని ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు ఈవెంట్‌ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ క్రేన్‌ కూలిపడటం తో 25 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. వేడుకల సందర్భంగా విద్యార్థినులు,విద్యార్థులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయగా, లైటింగ్‌ క్రేన్‌ విద్యార్థినుల వైపు కూలిపడటం తో పలువురు గాయపడ్డారు.క్షతగాత్రులను తొలుత ప్రత్యూష ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కామినేని,ఓవైసీ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ ఒక విద్యార్థిని మృతి చెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు.

విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

నాదర్‌గుల్‌లో విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దుర్ఘటన పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి

నాదర్‌గుల్ ఇంజినీరింగ్ కాలేజీ ఘటన అత్యంత విషాదకరం.. ఈ సంఘటనలో విద్యార్థి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌ నాదర్‌ గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనలో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థి కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని, వారి ఆవేదనను మాటల్లో చెప్పలేమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, వారు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.