- తాగునీటితో వాహనాలు కడిగితే ఫైన్ట
- 339 ఎస్టీపీల తనిఖీలకు అధికారులు సిద్ధం
హైదరాబాద్, మహా : తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మూడు నగరపాలక సంస్థలు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. నీటి వృథాను అరికట్టడంతోపాటు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించాయి. సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ), హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (ఎంఎంసీ) పరిధిలో నీటి పొదుపు చర్యలను వేగవంతం చేశాయి. ఈ మేరకు సీఎంసీ కమిషనర్ జి.సృజన శుక్రవారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ సంస్థలు నీటి పొదుపు నిబంధనలు పాటించేలా నోటీసులు ఇవ్వాలని, ప్రైవేటు మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) పనితీరును తనిఖీ చేసి మదింపు చేయాలని టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు.
నగరంలో తాగునీటి వృథాను అరికట్టడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాగునీటితో వాహనాలు కడగడం, ఇంటి ఆవరణలను శుభ్రం చేయడం, రోడ్లను కడగడం వంటి పనులకు పాల్పడితే జరిమానాలు విధించాలని మూడు కార్పొరేషన్లు నిర్ణయించాయి. తాగునీటిని తాగేందుకు, వంట అవసరాలకు, ఇతర అత్యవసర వినియోగాలకు అందుబాటులో ఉంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలు, అపార్ట్మెంట్ల యాజమాన్యాలు, వాణిజ్య సంస్థలు నీటి వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు, పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మున్సిపల్ సరఫరా నీరు, బోరుబావుల నీటి వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణ అవసరాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించాల్సి ఉంటుంది. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, గేటెడ్ కమ్యూనిటీలు తమ నిర్మాణ పనులతోపాటు పార్కులు, పచ్చదనం నిర్వహణకు కూడా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. పార్కులు, రహదారి మధ్య విభాగినులు, కాలిబాటల పక్కన ఉన్న చెట్లకు నీరు అందించేందుకు రీసైకిల్ చేసిన నీటిని వినియోగించాలని పార్కుల విభాగం అధికారులకు సూచించారు.
మరోవైపు వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో దశలవారీగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీరు వృథాగా కాలువల్లోకి వెళ్లిపోకుండా నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి.
సీఎంసీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల్లో 339 ఎస్టీపీలను గుర్తించినట్లు కమిషనర్ జి.సృజన తెలిపారు. వీటన్నింటినీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తనిఖీ చేసి, శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఎస్టీపీలు పనిచేయకపోయినా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఆయా కమ్యూనిటీల్లో పార్కులు, పచ్చదనం నిర్వహణకు ఏ రకమైన నీటిని ఉపయోగిస్తున్నారనే వివరాలను కూడా నమోదు చేయనున్నారు. ఈ తనిఖీల ద్వారా శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని పెంచడంతోపాటు తాగునీటి వృథాను నియంత్రించాలని మూడు కార్పొరేషన్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.








