Mahaa Daily Exclusive

  నిషేధాజ్ఞలు ఉన్నా నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం….!

Share

నిషేధాజ్ఞలు ఉన్నా నిలువరించలేని ప్రభుత్వ యంత్రాంగం.

నిషేధ ఆజ్ఞలను గాలికి వదిలేస్తున్న వైనం.

వార్తా సేకరణకై వెళ్లిన విలేకరులపై దౌర్జన్యాలు.

రాజకీయ నాయకుల పేర్లతో అక్రమ రవాణా.

హైదరాబాద్ కేంద్రంగా కోడి వ్యర్ధాలను రవాణా చేస్తున్న అక్రమ రవాణా దారులు.
_________
ఏలూరు/పెదపాడు. డిసెంబర్ 3 సూర్య న్యూస్:-కోళ్ల వ్యర్ధాలను చేపలకు వేసి పెంచరాదంటూ నిషేధాజ్ఞలను ప్రభుత్వం జారీనా, ఈ ఆజ్ఞలు అక్రమ రవాణా దారు లకు కాసుల పంటగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ అక్రమ కోళ్ల వ్యర్ధాల రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతోంది. ఈ కోళ్ల వ్యర్ధాలను చేపల చెరువులకు వేయడం వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, పెరగడంతోపాటు, ప్రజా జీవితంలో అనేక అనారోగ్య రుగ్మతలకు దారి తీస్తుందని మత్స్యశాఖ, ఆరోగ్య శాఖలు హెచ్చరించడంతో కోళ్ల వ్యర్ధాలను చేపలకు ఆహారంగా వేసేందుకు ప్రభుత్వం నిషేధాజ్ఞలను జారీ చేసింది. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో ఈ అక్రమ రవాణా, రవాణా దారులకు ఒక వరంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అక్రమ రవాణాకు పెదపాడు మండలం, భీమడోలు మండలం, ఉంగుటూరు మండలాల్లోని కొల్లేరు సమీప ప్రాంతాల్లోని చెరువుల రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందచ్చని గ్రహించిన రైతాంగం కోళ్ల వ్యర్ధాలతో సాగుకు ఉపక్రమించారు. దీన్ని వ్యాపారంగా మలుసుకున్న అక్రమ రవాణా దారులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి కోళ్ల వ్యర్ధాలను తరలించి రైతుల చెరువు వద్దకు చేర్చి అధిక లాభాలు పొందుతున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు మత్స్యశాఖ అధికారులు తీసుకున్న చర్యలు లేవనే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం ఈ అక్రమ రవాణా దారులపై, రైతులపై అనేకసార్లు దాడులు నిర్వహించి, రెవెన్యూ అధికారుల ద్వారా కోర్టులో కేసులు పెట్టి అపరాధ రుసుములు విధించినా ఈ అక్రమ రవాణా నిలువరించడంలో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోయారు. అక్రమ రవాణా దారులంతా ఒక సిండికేటుగా తయారై రవాణాకు ఉపయోగించే లారీ బయలుదేరిన దగ్గర నుండి చెరువు వద్దకు చేరి వాటిని విక్రయించే వరకు దారి పొడవునా బస్తీ తిరుగుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ అవసరమైతే కొన్ని గంటలపాటు లారీలను జనావాసాలకు దూరంగా పెట్టి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు కప్పి రవాణా చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది విలేకరులు వార్తా సేకరణకై వెళ్లిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ, పాత్రికేయులను బెదిరిస్తూ రాజకీయ నాయకుల అండదండలతో మూడు పూవులు ఆరు కాయలుగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గ్రామ కట్టుబాట్ల ప్రకారం భీమడోలు మండలంలోని కొన్ని గ్రామాలు ఈ కోళ్ల వ్యర్థాలను నిషేధించినా, దెందులూరు నియోజకవర్గానికి చెందిన పెదపాడు మండలంలోని అక్రమ రవాణా దారులు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటూ ఈ రవాణాను చేస్తూ అక్రమార్చనతో వెలసిల్లుతున్నారు. గత నాలుగు రోజులుగా ఈ రవాణాపై వార్తా సేకరణకై వెళ్లిన విలేకరులపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో రక్షకభటులకు ఈ సమాచారాన్ని చేరవేద్దామని పాత్రికేయులు ఎంత ప్రయత్నించినా వారి నుండి సమాధానం రావడంలేదని, పాత్రికేయులకు రక్షణ కల్పించాలంటూ పాత్రికేయులు వాపోతున్నారు. ఇటీవల పోలీస్ యంత్రాంగం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అహర్నిశలు ప్రయత్నిస్తున్న పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. ఈ రవాణా ను అరికట్టడం వల్ల వాయు, జల కాలుష్యాలను అరికట్టడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడిన వారలవుతారంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం నిలువరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.