అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన జీవీ
దేశంలోని మిగిలిన ఏ రాష్ట్రాలతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యుత్తమ క్రీడా విధానం అమల్లోకి రాబోతోందని తెలిపారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. క్రీడాకారులకు అన్నివిధాల సహాయ, సహకారాలు అందించేలా తీసుకుని వచ్చిన నూతన విధానంపై అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారాయన. ఈ నేపథ్యంలోనే తన నియోజవర్గం పరిధిలోని విద్యార్థినీ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలని, అత్యుత్తమ క్రీడాకారులకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తరపున ప్రత్యేక నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ శావల్యా పురం క్రీడాకారులు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిశారు. రాష్ట్రస్థాయి బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా వారందరినీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారు అభినందించారు.








