- ఐరాసలో భారత్ కుండబద్దలు!
- ఐరాస ప్రత్యేక ప్రతినిధి నివేదికలోని తప్పులను ఎత్తిచూపిన భారత దౌత్యవేత్త రఘు పూరి.
న్యూఢిల్లీ , మహా.
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భారత్‌లో కాకుండా పాకిస్థానే ఆశ్రయం కల్పిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి ఘాటుగా స్పష్టం చేసింది. మానవ హక్కులపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ సమర్పించిన నివేదికలో వాస్తవాలకు విరుద్ధమైన, అసంపూర్ణమైన అంశాలున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఉగ్రవాద నేత ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తించి హతమార్చిన దేశంలోనే నేడు దావూద్ ఇబ్రహీం కూడా తలదాచుకుంటున్నాడని భారత దౌత్యవేత్త రఘు పూరి అంతర్జాతీయ వేదికపై నిలదీశారు. కీలకమైన వాస్తవాలను విస్మరించడం వల్ల ఇటువంటి నివేదికల విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
- మానవ హక్కులపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ ఇటీవల సమర్పించిన నివేదికలో ‘డీ-కంపెనీ’ని కేవలం భారత్‌కు చెందిన ఓ సాధారణ నేర సంస్థగా పేర్కొన్నారు. అంతేకాకుండా దాని అధినేత దావూద్ ఇబ్రహీంకు ఉగ్రవాద సంబంధాలున్నాయని చెబుతూనే, అతడు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా, డీ-కంపెనీ అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తప్పుగా ప్రస్తావించారు. ఈ నివేదికపై భారత దౌత్యవర్గం తీవ్రంగా స్పందించింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం అని, వందలాది మంది మరణానికి కారణమైన ఈ మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని అప్పగించాలని భారత్ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోందనే కనీస అంశాన్ని నివేదికలో ప్రస్తావించకపోవడం గమసార్హం అని రఘు పూరి ఎత్తి చూపారు.
దావూద్ ఇబ్రహీం భారత్‌లో లేడని, అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో పాతుకుపోయి ఉన్నాడని ఐరాస రికార్డులే స్పష్టం చేస్తున్నాయని భారత ప్రతినిధి గుర్తుచేశారు. అమెరికా దళాలు మట్టుబెట్టిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఎక్కడైతే తలదాచుకున్నాడో, అదే పాకిస్థాన్ గడ్డపై నేడు దావూద్ ఇబ్రహీం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాడని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి, అండర్ వరల్డ్ మాఫియాకు అడ్డాగా మారిన పాకిస్థాన్ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఐరాస సంస్థలు కూడా వాటిని విస్మరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
ముంబై పేలుళ్ల ఘటనలో వందలాది నిరసరుల ప్రాణాలు బలిగొన్న ఈ ఉగ్రమూక నాయకుడిని చట్టం ముందు నిలబెట్టేందుకు భారత్ తన ప్రయత్నాలను ఎప్పటికీ ఆపబోదని, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో వాస్తవాలను గ్రహించి ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.







