- ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తప్పనిసరి కాదని స్పష్టీకరణ.
- సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!
న్యూఢిల్లీ, మహా.
భారత ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను మరింత పటిష్టం చేసే దిశగా సుప్రీంకోర్టు ఒక కీలక మరియు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లలో తప్పుడు సమాచారం లేదా వాస్తవాలను దాచిపెట్టే అభ్యర్థులపై సామాన్య ఓటర్లు ఇకపై నేరుగా ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ కింద దాఖలు చేసే ఇటువంటి ఫిర్యాదులకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 195 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ లేదా ఎన్నికల సంఘం ముందుస్తు అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా రెండు చట్టపరమైన నిబంధనలపై కోర్టు విచారణ జరిపింది. నామినేషన్ పత్రాలు లేదా అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే లేదా వాస్తవాలను దాచిపెట్టే అభ్యర్థులకు జరిమానాలు, జైలు శిక్ష విధించడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ సూచిస్తుంది. మరోవైపు, నియమించబడిన పబ్లిక్ అథారిటీ లేదా అధికారి రాతపూర్వక ఫిర్యాదు చేస్తే తప్ప, కొన్ని నిర్దిష్ట నేరాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోకూడదని సీఆర్పీసీ సెక్షన్ 195 చెబుతుంది. అయితే సెక్షన్ 125ఏ కింద చేసే నేరానికి సీఆర్పీసీ సెక్షన్ 195 నిబంధనలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 125ఏ కింద ప్రాసిక్యూషన్‌ను కేవలం పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే ప్రారంభించాలని పార్లమెంటు భావించి ఉంటే, దానికి అనుగుణంగా చట్టాన్ని సవరించి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి ఓటర్లు పూర్తిగా ఎన్నికల సంఘంపైనే ఆధారపడాలనే లేదా కేవలం ఎన్నికల పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాలనే వాదనను కోర్టు గట్టిగా తోసిపుచ్చింది.
ఇదే అంశానికి సంబంధించి 2023 ఎన్నికల సమయంలో కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ శైలేంద్ర బెల్దాలే తన నివాస చిరునామాకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాజ్‌కుమార్ మడ్కి దాఖలు చేసిన ఫిర్యాదును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం మాత్రమే ఇలాంటి ఫిర్యాదును ప్రారంభించగలదన్న హైకోర్టు వాదన స్పష్టంగా తప్పు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయితే, చట్టపరమైన అంశాలపై స్పష్టతనిచ్చినప్పటికీ సదరు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే బెల్దాలేపై విచారణను పునరుద్ధరించడానికి మాత్రం కోర్టు నిరాకరించింది. ఆరోపణలు ఇప్పటికే సమర్థవంతంగా తిప్పికొట్టబడినందున, విచారణ కొనసాగించడం న్యాయస్థానం సమయాన్ని వృధా చేయడమేనని అభిప్రాయపడింది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలవనుంది. అభ్యర్థి అఫిడవిట్లో అబద్ధం చెప్పారని పక్కా ఆధారాలు ఉంటే, ఏ పౌరుడు లేదా ఓటరు అయినా నేరుగా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీనికోసం పౌరులు ఇకపై ఎన్నికల సంఘం లేదా పబ్లిక్ అధికారి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అయితే, రాజకీయ ప్రేరేపిత కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వాస్తవ ఆధారాలు లేకుండా వేధించే ఉద్దేశంతో దాఖలయ్యే పనికిమాలిన ఫిర్యాదులను కొట్టివేసే పూర్తి విచక్షణాధికారం మేజిస్ట్రేట్లకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.






