Mahaa Daily Exclusive

  పంచాయ‌తీ రాజ్ శాఖ‌పై మంత్రి సీత‌క్క ముద్ర‌..

Share

పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క ముద్ర స్పష్టంగా కనబడుతోంది. సమగ్ర గ్రామాభివృద్దే లక్ష్యంగా పడిన అడుగులు తొలి ఏడాదిలో మార్పును స్పష్టంగా చూపాయి. పల్లెలే దేశానికి పట్టు గొమ్మలు. ప‌ల్లెలు అభివృద్ది సాధిస్తేనే దేశాభివృద్ది సాధ్యమ‌న్న‌ జాతి పిత మ‌హాత్మా గాంధీ గారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం, పంచాయ‌తీరాజ్ శాఖ తొలి ఏడాదిలోనే వ‌డి వడిగా ప్ర‌యాణం ప్రారంభించింది. ఓ వైపు పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతూనే… మ‌రో వైపు ప‌ల్లెల అభివృద్ది కోసం వినూత్న ప‌థ‌కాల‌ను అమ‌లు ప‌రుస్తోంది. బీఆర్ఎస్ గ‌త ప్ర‌భుత్వం స్థానిక ప్ర‌భుత్వాలను నామ‌మాత్రంగా మార్చింది. నిధులు, విధులు, నిర్ణ‌యాధికారం లేకుండా చేసి పంచాయ‌తీల‌ను నిర్వీర్యం చేసారు. గ్రామ జ్యోతి, మ‌న ఊరు-మ‌న ప్ర‌ణాళిక ల పేరుతో తిరిగి అధికారాల‌ను కేంద్రీక‌ర‌ణ చేసారు. పంచాయ‌తీల సొంత నిధులను, కేంద్ర గ్రాంట్ల‌ను గ్రామ అభివృద్ధి కోసం వెచ్చించ‌కుండా సర్పంచ్ ల‌పై ఎన్నో ర‌కాల‌ ఆంక్ష‌లు విధించింది. కేంద్ర నిధుల‌ను ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ల్లించింది. పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధుల‌ను సర్పంచ్ కు క‌నీసం స‌మాచారం లేకుండా.. పాల‌క‌మండ‌లికి తెలియ‌కుండా ప‌క్క దారి ప‌ట్టించింది. మ‌రో వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో కోత‌లు విధించింది. బీఆర్ఎస్ హాయంలో స్టేట్ ఫైనాన్స్ కమీష‌న్ నిధుల‌ను రూ.10,170 కోట్లు కేటాయించి..అందులో రూ.4181 కోట్ల‌ను దారి మ‌ళ్లించింది. అంటే 42 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు నిధుల‌ను సొంత అవ‌స‌రాల‌కు గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ల్లించింది. గ‌త ప్ర‌భుత్వం కొత్తగా నాలుగు వేల కొత్త‌ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినా ఏలాంటి ఆర్థిక వనరులు కల్పించకపోవ‌డంతో కొత్త పంచాయ‌తీలు ఏలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. స్థానిక ప్ర‌భుత్వాల అస్థిత్వాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసింది. ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా మెడ మీద క‌త్తి పెట్టి స‌ర్పంచ్ ల‌తో ప‌నులు చేయించారు. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో స‌ర్పంచ్ లు అప్పులు చేసి ప‌నులు పూర్తి చేసినా…ఏండ్ల త‌ర‌బ‌డి బిల్లులు చెల్లించ‌లేదు. ప‌దుల సంఖ్య‌లో స‌ర్పంచ్ లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నా గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టింపులేని త‌నంతో వ్య‌వ‌హ‌రించింది. గ‌త ప్ర‌భుత్వం నిర్ణయాల‌తో పంచాయ‌తీ వ్య‌వ‌స్థ అస్థ వ్యస్థంగా మారింది. పాత ప్ర‌భుత్వ తీరుతో స‌వాల‌క్ష స‌మస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గ్రామ పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వ‌చ్చి రాగానే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. దాదాపు 2 కోట్ల మంది ప్ర‌జ‌ల‌తో అనుబంధం ఉన్న శాఖ కావ‌డంతో ప్ర‌త్యేక దృష్టి సారించింది. అందులో బాగంగా చ‌రిత్ర‌లో ఎన్న‌డు లేనంత‌గా పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ బ‌డ్జెట్ ను రూ. 29,816 కోట్లను కేటాయించింది. గ్రామ పంచాయ‌తీల‌కు పాత ప్ర‌భుత్వం బ‌కాయిల‌ను రూ.750 కోట్ల వ‌ర‌కు ఈ ప్ర‌భుత్వం చెల్లింపులు చేసింది. అయితే స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ద‌వీకాలం ముగియడంతో కొన్ని ఇబ్బందులు ఎద‌ర‌వుతున్నాయి. ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోయాయి. అయితే ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం కుల గ‌ణ‌న స‌ర్వే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. స‌ర్వే పూర్తి కాగానే….జనాభా నిష్ఫ‌త్తి ప్ర‌కారం రిజర్వేష‌న్లు పెంచే క‌స‌ర‌త్తు కొనసాగుతోంది. అదే స‌మ‌యంలో గ్రామాల అభివృద్ది కోసం ప‌లు వినూత్న‌ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి సీత‌క్క పంచాయ‌తీ రాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ‌పై త‌న‌దైద ముద్ర వేసారు. సమగ్ర గ్రామాభివృద్దే లక్ష్యంగా అధికారులు, సిబ్బందిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. వ‌రుస స‌మీక్ష‌లతో పాటు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచే చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్థానిక ప్ర‌భుత్వాల పున‌రుజ్జీవ‌నం కోసం ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. స‌ర్పంచ్ లు, పంచాయ‌తీల అస్థిత్వాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని, స్వ‌తంత్ర‌త‌ను కాపాడే దిశ‌లో కీల‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో మార్పున‌కు నాంది ప‌లికేలా, సంస్క‌ర‌ణ‌ల‌కు స్వాగ‌తం ప‌లికేలా ప‌లు కీల‌క బిల్లుల‌ రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది. దీంతో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌లో తొలి ఏడాదిలో మార్పు విస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ ద్వారా గ్రామాల‌లో ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు ప్రజ‌ల జీవ‌నోపాది, జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగు ప‌రిచేందుకు రెండు సార్లు చేప‌ట్టిన స్వ‌చ్చ‌ద‌నం-ప‌చ్చ‌ద‌నం కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింది. 1.57 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేసారు. అన్ని గ్రామాల్లో పారిశుద్య నిర్వ‌హ‌ణ తో పాటు రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేసారు. దోమ‌ల నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్వ‌చ్చ‌ద‌నం-ప‌చ్చ‌ద‌నం కింద 2.60 కోట్ల‌కు పైగా మొక్క‌ల‌ను నివాస గృహాల‌కు పంపిణి చేసి నాటించారు. 1.84 ల‌క్ష‌ల మ‌ల్టీప‌ర్ప‌స్ కార్మికులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. రూ.846 కోట్ల ఖ‌ర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 26,231 చెరువుల్లో పూడిక తీక ప‌నులు పూర్తి చేసి వాటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రూ.460 కోట్లు ఖ‌ర్చు చేసి ఫీడ‌ర్ చాన‌ల్స్ పూడిక‌తీతకు సంబంధించి 52,097 పనులు చేప‌ట్టారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న స‌న్న‌కారు రైతు భూమిని సాగులోకి తెచ్చేందుకు రూ.282.2 కోట్లు ఖ‌ర్చు చేసాం. వ‌న‌మ‌హోత్సవం కార్య‌క్ర‌మం ద్వారా గ్రామాల్లో 6.99 కోట్ల మొక్క‌ల‌ను నాటారు. అలాగే రైతుల వ్య‌క్తిగ‌త భూముల్లో మామిడి, నిమ్మ వంటి పండ్ల తోట‌ల పెంప‌కం..చెరువు గ‌ట్ల వెంట ప్లాంటేష‌న్లు, ఈత‌, మల‌బార్ వేప ప్లాంటేష‌న్, మ‌ల్బ‌రీ తోట ప్లాంటేష‌న్ల కోసం మొక్క‌లు నాటారు. మొత్తం 13,063 ఎక‌రాల్లో పండ్ల మొక్క‌ల‌ను నాట‌డం ద్వారా 7306 చిన్న స‌న్న‌కారు రైతుల‌కు లాభం జ‌రిగింది. వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.20.99 కోట్ల‌ను 18,812 మంది ల‌బ్ది దారుల‌కు అంద‌చేయడం జ‌రిగింది. పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్, గ్రామీణ తాగు నీటి వ్య‌వ‌స్థ‌లో 499 ఏఈఈల నియామ‌కం జ‌రిగింది. కొత్త‌గా వేయి జీపీ భ‌వ‌నాలు, 960 అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నాలుగేళ్ళలో 17 వేల కిలోమీట‌ర్ల మేర ప‌ల్లె రోడ్ల ఆధునీక‌ర‌ణ కోసం కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్దం అవుతోంది. గ్రామీణ ర‌హ‌దారుల కాంట్రాక్ట‌ర్ల‌కు గ‌త ప్ర‌భుత్వం పెండింగ్ లో ఉంచిన‌ రూ.347.64 కోట్ల బిల్లుల‌ను చెల్లించడం జ‌రిగింది. ఆదిమ జాతి గిరిజ‌న తెగ‌లు నివసం ఉంటున్న 28 ఆవాసాల‌కు రూ. 65.85 కోట్ల‌తో చేప‌ట్టిన 66.98 కి.మీ ర‌హ‌దారుల‌ నిర్మాణ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. 2800 కి.మీ కొత్త గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ.3789.63 కోట్ల‌తో ప‌నులు కొన‌సాగుతున్నాయి. గ్రామీణ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ కోసం రూ.1879.57 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. రూ. 298.92 కోట్ల‌తో కొత్త‌గా మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు చేప‌ట్టారు. గ‌త వేస‌విలో ఎలాంటి తాగు నీటి ఎద్ద‌డి లేకుండా విజ‌య‌వంతంగా మంచి నీటి స‌ర‌ఫ‌రా చేసారు. క‌ర్ణాట‌క‌లోని నారాయ‌ణ పూర్ డ్యాం నుంచి జూరాల జ‌లాశ‌యానికి 2 టీఎంసీ నీటిని విడుద‌ల చేయించి తాగు నీటి స‌మ‌స్య లేకుండా చేసింది ప్ర‌భుత్వం. శిల్పారామంలో రూ.9 కోట్ల‌తో ఇందిరా మ‌హిళా శ‌క్తి బ‌జార్ ఏర్పాటు చేయడంతో పాటు స్వ‌యం స‌హాయ‌క సంఘాల ఉత్ప‌త్తుల‌కు 106 దుకాణాల కేటాయించారు. ఇంటిగ్రేటేడ్ క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్ లు, టూరిస్ట్ ప్లేస్ లో 36 మ‌హిళా శ‌క్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసారు. ఏడాది చివరి నాటికి మొత్తం 150 క్యాంటీన్ల ను ప్రారంబించ‌నున్నారు. గ్రామీణ ప్రాంతాల ఆర్దిక ప‌టిష్ట‌త‌, పంచాయ‌తీల స్వ‌తంత్ర‌త‌ను కాపాడే దిశ‌లో మంత్రి సీత‌క్క నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు, మ‌రెన్నో వినూత్న ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. తొలి ఏడాదిలోనే పీఆర్ ఆర్ డీ శాఖ త‌న‌దైన మార్పును స్పష్టంగా చూపింది.

– నరేష్

Latest