Mahaa Daily Exclusive

  కేసీఆర్ గారూ.. శాసనసభకు రండి..

Share

  • మీ అనుభవాల్ని తెలంగాణ ప్రజలకు పంచండి
  • ఒక ఎకరాతో కోటి రూపాయలు ఎలా సంపాదించొచ్చో వివరించండి
  • పదేళ్ళు అధికారంలో ఉంది మీరే కదా..
  • పది నెలలకే మమ్మల్ని ఎందుకు దిగిపో అంటున్నారు
  • ప్రజాపాలనపై విపక్షాల తప్పుడు ప్రచారం.. విషప్రచారాన్ని తిప్పికొట్టండి
  • ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?
  • పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • -9వేల మందికి నియామక పత్రాలు
  • – స్కిల్ యూనివర్సిటీ కి ఏడు కంపెనీలతో ఒప్పందాలు

 

పెద్దపల్లి, మహా

 

తన అనుభవంతో సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యారని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని, దాని కోసమే ఖమ్మం జిల్లా పాల్వంచలో మెుదట ఉద్యమం మెుదలైందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రాజ్యం.. రాష్ట్రంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ఆయన పాల్గొని గ్రూప్‌-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ గారూ! శాసన సభకు వచ్చి మీ అనుభవాల్ని తెలంగాణ ప్రజలకు పంచండి అంటూ సూచన చేశారు. ఒక ఎకరాతో కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చో ప్రజలకు తెలియజేయండి. ఆ ప్రజాభవన్ నుండే విశ్లేషించండి. ఆయన విద్య… ఆ రహస్యం ఏమిటో ఈ రోజుకూ అంతుచిక్కడం లేదన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ తేలే. రామగుండంకు తేలే. ఆదిలాబాద్ కు తేలే.

పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని… మేం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనే దిగిపోండని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తమను ఐదేళ్లు పాలించాలని ఎన్నుకున్నారన్నారు. మేం మంచి పనులు చేస్తుంటే ఆశీర్వదించడానికి ఏమవుతుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు తమను బెదిరించి పనులు చేయించుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. తాము పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చామన్నారు. రామగుండంకు విమానాశ్రయం కూడా తీసుకు వస్తామన్నారు.

 

పదేళ్ళపాలన పోల్చి చూడండి

 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనను.. ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మోదీ సీఎంగా, ప్రధానిగా ఒక ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ సభకు వచ్చి తన అనుభవాన్ని అందరికీ పంచాలన్నారు. బీసీ కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. బీసీ వ్యతిరేకులా చెప్పాలని నిలదీశారు. ఒక మంచి పని కోసం ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు సహకరించాలన్నారు. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సమాజం బహిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

9 వేల మందికి నియామక పత్రాలు

 

యువజన వికాస విజయోత్సవ సభలో 9వేల మంది నిరుద్యోగులకు నియామకపు పత్రాలు సీఎం అందించారు. 500మందికి సింగరేణి ఉద్యోగాల నియామకాలు, గ్రూప్‌- 4, ఇతర ఉద్యోగాలు దాదాపు 8500 మందికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభించారు. స్కిల్ యూనివర్శిటీకి ఏడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

……..

Latest