- ఢిల్లీలో సమరశంఖం
- ఇండియాకూటమి ‘చలో ఢిల్లీ’ మహా గర్జన
- దేశవ్యాప్తంగా తరలివచ్చిన జనప్రభంజనం
- కిక్కిరిసిన రాంలీలా మైదానం
- జ్ఞానేశ్ జైలుకువెళ్ళక తప్పదు- రాహుల్ గాంధీ
- మీ రోజులు ముగిసిపోయాయి- మోదీ, అమిత్ షాపై కాంగ్రెస్ ధ్వజం
- రైళ్ళు ఆపినా ప్రభంజనంలా వచ్చాం – సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ, మహా :
ఢిల్లీ దద్దరిల్లింది. ఎన్నికల కమిషన్ అక్రమాలపై ఇండియా కూటమి సమరశంఖం పూరించగా, జనగర్ఝనతో హోరెత్తింది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు భారీ చలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగుతున్న ఈ భారీ నిరసన సభలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇరత ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి బీజేపీ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్ల అభిప్రాయాలను సైతం ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని స్వయంగా కమిషనర్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు.
ఓట్లు తొలగించి, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి, అక్కడ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దళితులు, గిరిజనులు, మహిళలు, యువతకు అంబేడ్కర్ ఓటు హక్కు కల్పించారని రేవంత్ రెడ్డి తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించు, పాలించు విధానాన్ని మోదీ అమలు చేస్తున్నారని విమర్శించారు. మూడోసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేశారని ఆరోపించారు. మహిళలు, ఆదివాసీలు, గిరిజనులకు ఓటు హక్కు తొలగించాలని కుట్ర చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, రాబోయే రోజుల్లో 20 కోట్ల వరకు ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 15-20 శాతం ఓట్లు తొలగించి మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. దీనికి ప్రయోగాత్మకంగా మహారాష్ట్ర, బిహార్, బెంగాల్లో ఓట్లు తొలగించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. “గతంలో శ్రీమంతులు, ఉన్నతవర్గాలకు ఓటు హక్కు ఉండాలని వాదించారు. అంబేడ్కర్ దళితులు, గిరిజనులు, మహిళలు, యువతకు ఓటు హక్కు కల్పించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే చర్యలు చేపట్టారు. జనాభా పెరిగిన మేరకు ఓటు హక్కు కల్పిస్తూ వచ్చారు. మూడోసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేశారు. ఓటు అనే ఆయుధాన్ని మోదీ తొలగిస్తారని బీజేపీని ప్రజలు ఓడించారు. ఆనాటి నుంచి దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై మోదీ కక్ష పెంచుకున్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా చేసి పునాది లాంటి ఓటును తొలగించే యత్నం. ఇప్పటివరకు 13.5 కోట్ల ఓట్లను తొలగించారు” – రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం
రైళ్లను ఆపినా వచ్చాం
ఢిల్లీలో ప్రధాని మోదీ కుర్చీ కాపాడేందుకు పేదల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాంలీలా మైదానంలో నిరసన తెలిపేందుకు దేశ నలుమూలల నుంచి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గళం వినిపించేందుకు ఢిల్లీ రావడానికి రైళ్లు ఇవ్వకుండా కుట్ర చేశారని విమర్శించారు. రైళ్లను ఆపినా తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి కదంతొక్కిన వేలాది మందిని ఆపారా? ప్రశ్నించారు. తెలంగాణ గళం, బలం ముందు మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్ తలవంచక తప్పలేదని వెల్లడించారు.







