పంజాబ్‌లో ‘ఆప్’కు భారీ షాక్.
* తొలి జాబితా ప్రకటన వెనువెంటనే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా!
* టికెట్ కేటాయింపులపై చెలరేగిన అసంతృప్తి.
* పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి దూరమైన హర్మీత్ సింగ్, చేతన్ సింగ్
చండీగఢ్,మహా.
పంజాబ్ రాజకీయాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితా తీవ్ర దుమారానికి దారితీసింది. జాబితా వెలువడిన మరుసటి రోజే ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
పటియాలా జిల్లాలోని సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మాజ్రా, అలాగే సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే, భగవంత్ మాన్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన చేతన్ సింగ్ జౌరామాజ్రా తమ రాజీనామాలను ప్రకటించారు. హర్మీత్ సింగ్ తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపగా, జౌరామాజ్రా సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. పంజాబ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎంతో ఆవేదన కలిగించేలా ఉన్నాయని, పార్టీలో ఇమడలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టికెట్ దక్కదనే ముందస్తు సంకేతాలతోనే అసమ్మతి!
రాబోయే 2027 ఎన్నికల నిమిత్తం ఆప్ అధిష్టానం అక్టోబర్ 31న మొత్తం 40 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఈ మొదటి జాబితాలో హర్మీత్ సింగ్ పఠాన్మాజ్రా, చేతన్ సింగ్ జౌరామాజ్రాల పేర్లు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ఈ రెండు నియోజకవర్గాలకు పార్టీ ఇప్పటికే వేరే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం, రానున్న ఎన్నికల్లో వీరికి టికెట్లు నిరాకరించే ఛాన్స్ ఉందన్న సంకేతాలు రావడంతోనే వారు ఈ తిరుగుబాటు బావుటా ఎగరేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇప్పటికే పదవి కోల్పోయిన చేతన్ సింగ్ జౌరామాజ్రా తాజా పరిణామాితో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరోవైపు హర్మీత్ సింగ్ పఠాన్మాజ్రా సైతం కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో విభేదాలు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తొలి జాబితా ప్రకటనతోనే ఆప్ శిబిరంలో అసమ్మతి జ్వలలు చెలరేగడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.







