- పులివెందులలో భగ్గుమన్న రాజకీయాలు.
- హెలికాప్టర్ వివాదం నుంచి జగన్ రోడ్‌షో వరకు తీవ్ర ఉద్రిక్తత!
పులివెందుల,మహా.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైంది. పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించడం, భారీ వాహనాల శ్రేణితో రోడ్‌షో నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) కఠినంగా అమల్లో ఉన్న తరుణంలో ఈ తరహా హంగామాకు ఎలా అనుమతి ఇస్తారంటూ అధికార కూటమి నేతలు ఎన్నికల సంఘాన్ని నిలదీస్తున్నారు. జగన్ తీరు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రక్రియను, ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది.
పులివెందుల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అత్యంత ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఏర్పడిందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే, నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే వైఎస్సార్సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. సరిగ్గా పోలింగ్ రోజున కూడా వివాదాలకు తెరలేపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జగన్ పులివెందుల ప్రయాణం ప్రారంభమైన క్షణం నుంచే వివాదాలుు చుట్టుముట్టాయి. షెడ్యూల్ ప్రకారం కాకుండా అనుకున్న సమయానికి ముందే హెలికాప్టర్ ల్యాండింగ్ అంశం పెద్ద దుమారమే రేపింది. సమయపాలన పాటించకుండా అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, హెలికాప్టర్ కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి నానా హంగామా సృష్టించాల్సి వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపించారు. చివరికి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, జగన్ అనుసరించిన ఈ శైలి అధికారులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని మండిపడ్డారు.
పోలింగ్ కేంద్రాల వద్ద జగన్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు అభ్యంతరాల వర్షం కురిపించారు. ఎన్నికల నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి భారీ వాహనాలతో కాన్వాయ్‌గా వెళ్లడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. తనను ఎక్కడో అడ్డుకుంటున్నారంటూ మీడియా ముందు ఆరోపణలు చేస్తూనే, మరోవైపు మార్గమధ్యంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాజకీయ లబ్ధికేనని ఎద్దేవా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, పోలింగ్‌కు ముందు పులివెందులలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడు కార్లు, పది ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలే దగ్ధం చేశారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
నామినేషన్ల ఘట్టం నుంచి వైఎస్సార్సీపీ వర్గాలు నియోజకవర్గంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని, పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ కావాలనే గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లదాడులు, తోపులాటలతో బీభత్సం సృష్టించారని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, వైఎస్సార్సీపీ దూకుడుతో ఎన్నికల స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తానికి పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదం, జగన్ రోడ్‌షో, వాహనాల దహనకాండ, పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది, నిబంధనల ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








