ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం దీపావళి కానుక.
* భారీగా నిధులు విడుదల!
* అర్నబ్ తుఫాన్ నష్టాలపై కేంద్ర బృందాని ప్రాథమిక నివేదిక అందజేత.
* రూ. 4,597 కోట్ల పన్నుల వాటా కేటాయింపు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందజేస్తూ భారీగా నిధులను విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.1,09,019 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పంపిణీ చేసింది. ఈ నిధులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,597 కోట్ల రూపాయలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇలా అదనపు విడత నిధులు విడుదల చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో మూలధన వ్యయం, వివిధ సంక్షేమ పథకాలు, మరియు కీలకమైన అభివృద్ధి పనుల అవసరాలకు ఈ నిధులు ఎంతగానో తోడ్పడనున్నాయి.
వివిధ రాష్ట్రాలకు దక్కిన పన్నుల వాటా వివరాలు
కేంద్రం పంపిణీ చేసిన ఈ మొత్తం నిధులలో పలు రాష్ట్రాలకు భారీ మొత్తంలోనే వాటాలు దక్కాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందరికంటే ఎక్కువగా రూ.19,208 కోట్లు పొందింది. అలాగే బీహార్ రాష్ట్రానికి రూ.10,845 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.8,010 కోట్లు దక్కగా.. పశ్చిమ బెంగాల్ రూ.7,866 కోట్లు, మహారాష్ట్ర రూ.7,022 కోట్లు, రాజస్థాన్ రూ.6,460 కోట్ల రూపాయలను సాధించాయి. ఇక మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.2,370 కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా, ఈ ఆరు ప్రధాన రాష్ట్రాలకే మొత్తం నిధులలో ఏకంగా 54.49 శాతం వాటా లభించడం గమనార్హం.
అర్నబ్ తుఫాన్ నష్టాలపై కేంద్ర బృందం పరిశీలన
మరోవైపు, ఇటీవల రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘అర్నబ్ తుఫాన్’ వల్ల జరిగిన విధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమగ్రమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,253 గ్రామాల్లోని సుమారు 3.33 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన కేంద్ర అధికారుల బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, ప్రత్యక్షంగా బాధితులను కలిసి మాట్లాడింది. ముఖ్యంగా రావులపాలెం ప్రాంతంలో తుఫాన్ సృష్టించిన బీభత్సం, తీవ్రతను కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను వారు పరిశీలించారు. తమను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు కేంద్ర బృందాన్ని వేడుకోగా.. ప్రభుత్వానికి నివేదించి తగిన న్యాయం చేస్తామని అధికారులు వారికి భరోసా కల్పించారు.








