మరోసారి తెరపైకి ఫోన్ టాపింగ్ కేసు.
* మాజీ మంత్రి హరీశ్‌రావుపై సిద్దిపేటలో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు!
* భౌగోళిక పరిధి కారణంగా పంజాగుట్ట నుంచి సిద్దిపేట వన్‌టౌన్‌కు బదిలీ.
* చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో ఏ1గా హరీశ్‌రావు.. ఎఫ్ఐఆర్లో మరిన్ని అదనపు సెక్షన్లు చేర్పులు.
సిద్దిపేట, మహా.
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును భౌగోళిక పరిధి (జ్యూరిడిక్షన్) కారణంగా సిద్దిపేటకు బదిలీ చేయగా, స్థానిక పోలీసులు సరికొత్త క్రైమ్ నంబర్‌తో కేసును నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
చక్రధర్ గౌడ్ సంచలన ఫిర్యాదు..
సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన బలమైన ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదు కావడం గమనార్హం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తన మూడు ఫోన్ నంబర్లతో పాటు తన భార్య ఫోన్‌ను కూడా అత్యంత రహస్యంగా ట్యాప్ చేశారని, వ్యక్తిగత సంభాషణలను, కీలక సమాచారాన్ని అక్రమంగా సేకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం తనపైనే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అనుచరుల కదలికలపై కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు.
ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అడ్డుపెట్టుకుని తనను రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా తనపై బెదిరింపులకు పాల్పడ్డారని, బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒకవేళ పార్టీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు.
గత వేధింపులు.. న్యాయపోరాటం ద్వారానే కేసు
తనపై అప్పట్లో తప్పుడు కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. హరీశ్‌రావు తన రాజకీయ ప్రభావాన్ని, అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించి పోలీసుల ద్వారా తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బాధితుడిగా తాను గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ నాటి ప్రభుత్వ ప్రభావంతో వారు స్పందించలేదని, కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, న్యాయస్థానం జోక్యంతోనే కేసు నమోదు ప్రక్రియ ముందుకు సాగిందని తెలిపారు.
కొత్త ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్ల నమోదు
మొదట ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో Cr.No.1205/2024 నంబర్‌తో కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును ఏ1గా, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏ2గా పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ కేసు సిద్దిపేట వన్‌టౌన్‌కు బదిలీ కావడంతో పోలీసులు పాత ఎఫ్ఐఆర్తో పాటు మరో ఆరు అదనపు సెక్షన్లను చేర్చారు. ఐపీసీలోని 419, 420, 467, 406 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 66సి, 66డి సెక్షన్లను కొత్త ఎఫ్ఐఆర్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు సిద్దిపేటకు బదిలీ కావడంతో పాటు చట్టపరంగా మరింత బలమైన సెక్షన్లు నమోదు కావడంతో.. రాబోయే రోజుల్లో ఈ విచారణ ఏమలుపు తిరుగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








