దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ‘జేఎన్‌వీఎస్‌టీ 2026’ (JNVST) ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నవోదయ విద్యాలయ సమితి (NVS) అధికారికంగా విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ విధానంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ ప్రవేశ పరీక్ష నవంబర్ 28న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరగనుండగా, చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే హాల్‌టికెట్లు పొందాలని అధికారులు సూచించారు.
హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే “Click here to download Admit Card for Class VI JNVST” అనే లింక్‌ను ఎంచుకుని, విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (DOB)తో పాటు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. అనంతరం ‘Submit’ లేదా ‘Sign In’ బటన్‌పై క్లిక్ చేయగానే అడ్మిట్ కార్డు తెరపై కనిపిస్తుంది. దానిని భవిష్యత్ అవసరాల నిమిత్తం డౌన్‌లోడ్ చేసుకుని రెండు కాపీలు ప్రింటవుట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డు పొందిన వెంటనే అందులో పేర్కొన్న విద్యార్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం వంటి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా సాంకేతిక లోపాలు లేదా వివరాల మార్పులు ఉంటే వెంటనే నవోదయ అధికారులను సంప్రదించి సరిదిద్దుకోవాలి. పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ హాల్‌టికెట్‌ను వెంట తీసుకురావాలని, పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సమితి మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.










