- రాష్ట్ర పండుగ, యాదవుల ఆత్మగౌరవ ప్రతీక
- సదర్ ను రాష్ట్ర పండుగగా ప్రకటించి రూ. 5 కోట్లు కేటాయించాం
- యాదవులకు రాజకీయంగా, సంక్షేమంలోనూ సముచిత స్థానం కల్పిస్తాం
ఆత్మగౌరవాన్ని కాపాడుతాం
సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యాదవుల విజ్ఞప్తి మేరకు తమ ప్రభుత్వం సదర్‌ను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా, దీని నిర్వహణ కోసం రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో శాస్త్రీయంగా కులగణన చేసి చూపించామని, ఈ తెలంగాణ మోడల్‌ను దేశమంతా అనుసరించేలా సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించామని వివరించారు.
హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని యాదవ సోదరులందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్ సమ్మేళనం అనేది కేవలం యాదవులకే పరిమితం కాదని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనమని అభివర్ణించారు. హైదరాబాద్ సిటీలో నేడు ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోట ఒకనాడు ‘గొల్ల కొండ’గా ఉండేదని గుర్తుచేశారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ సోదరుల సహకారం ఎంతో ఉందో కొనియాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ యాదవులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని ప్రశంసించారు.
యాదవ సోదరులకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తావించారు. అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, అలాగే ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించామని తెలిపారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన యాదగిరిగుట్ట గోశాలలో గోసంరక్షణకు అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా అన్ని చర్యలు తీసుకుంటామని, వారి ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు రాకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు.
తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర సమగ్ర పురోగతికి మైలురాయిగా నిలిచే మూసీ నది పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమం, ప్రగతి కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి, ఈ బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలకు యాదవ సోదరులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.







