- ఓటర్ల నమోదులో సరికొత్త రూల్స్.
- అధికారుల విదేశీ టూర్లకూ కళ్లెం.
ఢిల్లీ, మహా.
కేంద్ర ఎన్నికల సంఘం తన వ్యవస్థలో భారీ ప్రక్షాళనకు తెరతీసింది! ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉన్న అనవసరపు అడ్డంకులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్లైన్లో కొత్త ఓటు కోసం అప్లై చేసుకునే ఫారం-6 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిక్లరేషన్ను పూర్తిగా కట్ చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, ఈ డీ-లింక్ నిబంధన మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ పక్కాగా వర్తిస్తుందని కుండబద్దలు కొట్టింది. అంటే.. ఇకపై ఓటరు జాబితాలో తమ పేరు ఎక్కించుకోవాలనుకునే పౌరులు ఫారం-6 నింపేటప్పుడు ఈ తలనొప్పి డిక్లరేషన్ను జత చేయాల్సిన పనే లేదు!
వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఈసీ తన సొంత ఇంటి నుంచే కఠిన మార్పులు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారుల తీరుపై ఉక్కుపాదం మోపుతూ వారి విదేశీ పర్యటనలకు గట్టి బ్రేకులు వేసింది. ఇకపై ఎన్నికల సంఘంలో పనిచేసే ఏ అధికారి ఫారిన్ ట్రిప్ వేయాలన్నా ముందస్తుగా ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేకాదు, ఈసీ అధికారుల మీటింగ్ల వ్యవహారంలోనూ పక్కా ప్రొఫెషనలిజం తీసుకొచ్చింది. మీటింగ్కు ముందే అజెండాను సభ్యుల చేతిలో పెట్టడంతో పాటు, సమావేశం ముగిశాక అధికారికంగా మినిట్స్ రిలీజ్ చేసే సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది.
మరోవైపు ఈసీ బాస్ల మధ్య పదేపదే చిచ్చుపెడుతున్న ఐటీ మోడ్యూళ్ల వివాదాలకు చెక్ పెట్టేలా పక్కా మాస్టర్ ప్లాన్ వేసింది. గతంలో కొత్త ఐటీ మోడ్యూళ్ల ఆమోదం విషయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ , ఇతర ఎలక్షన్ కమిషనర్ల మధ్య తీవ్ర స్థాయిలో రచ్చ జరిగేది. ఈ ఈగో క్లాషెస్కు ఎండ్ కార్డ్ వేస్తూ.. ఇకపై కొత్త ఐటీ మోడ్యూళ్ల ప్రతిపాదనలు నేరుగా కమిషన్ టేబుల్ ముందుకు రాకుండా ఒక స్పెషల్ కమిటీకి వెళ్లేలా రూట్ మ్యాప్ మార్చింది. ఆ ప్రత్యేక కమిటీలో అణువణువూ స్క్రీనింగ్ జరిగి, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తుది పరిశీలన కోసం ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చేలా పక్కా స్కెచ్ వేసి అంతర్గత వివాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది!






