Mahaa Daily Exclusive

  మోదీతో చర్చకు సిద్ధమా? 

Share

  • రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాల్
  • చర్చకు సిద్ధమైతే లేఖ రాయాలి
  •  పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం

హర్యానా, మహా : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. గురువారం హర్యానాలోని కర్నాల్‌లో బీజేపీ నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో’ పాదయాత్రలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడం కాదని, నిజంగా చర్చ జరపాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని రాహుల్‌కు సూచించారు. చర్చించడానికి తాము ఏమాత్రం వెనుకాడబోమని, ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారంతో పాటు ఏ అంశంపైనైనా సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.

వియత్నాం పర్యటనపై ప్రశ్నల వర్షం

ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన వియత్నాం పర్యటనను అమిత్ షా తీవ్రంగా ఎండగట్టారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత విపక్ష నేతగా రాహుల్‌పై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హితవు పలికారు. సభను సజావుగా సాగనివ్వకుండా అరాజకం సృష్టించడమే కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని ఆరోపించారు. దేశ ప్రజలు వరుసగా మూడోసారి మోదీ నాయకత్వాన్ని బలపరిచారని, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

విదేశీ శక్తుల అండతోనే మోదీ ప్రధాని అయ్యారని, ఆర్థిక వ్యవస్థను విదేశీయులే నడిపిస్తున్నారంటూ అంతకుముందు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఏ వేదికపైనైనా చర్చకు రావాలంటూ మోదీకి ‘ఎక్స్’ వేదికగా రాహుల్ బహిరంగ సవాల్ విసరడం ఈ రాజకీయ దుమారానికి దారితీసింది.