- దాడులు చేసి నిర్ధారించిన ఏసీబీ
- 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు, విలువైన వస్తువులు
హైదరాబాద్, మహా : పేదరికాన్ని నిర్మూలించాల్సిన శాఖలోనే ఓ అధికారి కోట్లకు పడగలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పట్టణ పేదల సంక్షేమం చూసే ‘మెప్మా’ అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల (నల్లబోతు) యాదగిరి రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ బృందాలు ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లతో సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక తనిఖీల్లోనే సుమారు రూ. 4.75 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఏసీబీ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో లభ్యమైన ఆస్తులు చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. యాదగిరి పేరిట హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో ఉన్న 12 ఖాళీ ప్లాట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 58.63 లక్షలుగా ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోనే రూ. 31.36 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు, రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే జీ ప్లస్ 3 భవనంతో పాటు ఓ పెంట్‌హౌస్ ఉన్నట్లు తేలింది. వీటితో పాటు సూర్యాపేట జిల్లాలో ఒక ఆర్సీసీ ఇల్లు, ఉప్పల్‌లో ఒక దుకాణం కూడా బయటపడ్డాయి. ఇల్లు, భూములే కాకుండా విలాసవంతమైన జీవితానికి సంబంధించిన సామాగ్రి కూడా లభ్యమైంది. నగదు, నగలు, వాహనాల రూపంలో భారీగా ఆస్తులు లభించాయి. తనిఖీల్లో దాదాపు 1.8 కేజీల (1,792.2 గ్రాములు) బంగారు ఆభరణాలు లభించాయి, వీటి విలువ రూ. 33.82 లక్షలుగా పేర్కొన్నారు. అలాగే రూ. 1.80 లక్షల విలువైన 3 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విషయానికొస్తే ఒక టయోటా ఫార్చ్యూనర్ తో పాటు మరో లగ్జరీ కార్ దొరికాయి, వీటి మొత్తం విలువ రూ. 73 లక్షలు ఉంటుందని అంచనా వేసారు. ద్విచక్ర వాహనాలు, రూ. 29.08 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 7.01 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 32.30 లక్షల నగదును ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బ్యాంక్ లాకర్లు, స్థిరాస్తి పత్రాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ఇంకా అదనపు వివరాలు సేకరిస్తున్నారు. యదగిరి రావును హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.







