Mahaa Daily Exclusive

  పవనే నా బ్రాండ్

Share

  • పవన్ అభిమానం ముందు పార్టీ టికెట్ కూడా చిన్నదే
  • మల్లప్ప.. అభిమారం గెలిచిందప్పా

అమరావతి, మహా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. రాజకీయ పార్టీల పొత్తులు, టికెట్ల కేటాయింపులు, గెలుపోటముల లెక్కలు ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు తన అభిమాన నాయకుడిపై ఉన్న నమ్మకంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన మల్లప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానమే తన బలంగా భావించిన మల్లప్ప.. ‘పవన్ కళ్యాణ్ నా బ్రాండ్.. ఆయన కటౌట్‌తోనే గెలుస్తా’ అంటూ ప్రచారంలోకి దిగారు. పొత్తులో భాగంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి టికెట్ టీడీపీకి వెళ్లినా, వెనక్కి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తన భార్యను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించి, పవన్ కళ్యాణ్ అభిమానమే తమ ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లారు. అభిమాన నాయకుడి పేరు, గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్లిన మల్లప్ప.. చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రింగ్ గుర్తుపై పోటీ చేసి గెలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయాల్లో కౌన్సిలర్‌గా గెలవడమే పెద్ద విజయంగా భావించే పరిస్థితుల్లో.. ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసి విజయం సాధించడం విశేషం

ఇక్కడితో కథ ముగియలేదు. విజయం సాధించిన తర్వాత స్వయంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మల్లప్పకు ఫోన్ చేసి అభినందించారు. “నిన్ను చూస్తే గర్వంగా ఉంది” అంటూ ప్రశంసించారని మల్లప్ప వెల్లడించారు. దీంతో మల్లప్ప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా రాజకీయాల్లో పార్టీ టికెట్ రాకపోతే అసంతృప్తితో పార్టీ మారడం, రెబల్‌గా పోటీ చేయడం చూస్తుంటాం. కానీ మల్లప్ప మాత్రం పార్టీ టికెట్ దక్కకపోయినా, తన అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను వదులుకోకుండా ఎన్నికల్లో విజయం సాధించి ఆ గెలుపును ఆయనకే అంకితం చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. రాజకీయాల్లో పదవులు, పార్టీలు, టికెట్ల కంటే అభిమాన నాయకుడిపై నమ్మకం ఎంత బలంగా పనిచేస్తుందో మల్లప్ప ఉదంతం మరోసారి చర్చకు తెరలేపింది. ఇలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.