Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికులకు ‘దీపావళి’ కానుక.

Share

  •  నేడే ఖాతాల్లోకి రూ.1,10,250 పీఎల్‌ఆర్‌ బోనస్‌.
  •  దేశ ఇంధన భద్రతకు బొగ్గు గని కార్మికులే వెన్నెముక.
  •  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, మహా.

దేశానికి వెలుగులు పంచుతూ, ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని కార్మికులకు పనితీరు ఆధారిత బహుమతి (పీఎల్‌ఆర్) కింద ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్‌ను మంగళవారం చెల్లించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ప్రధాన కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాలతో కూడిన సంయుక్త సంప్రదింపుల కమిటీ (జేసీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చెల్లింపులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థల పనితీరును పరిగణనలోకి తీసుకుని అర్హులైన కార్మికులందరికీ ఈ పీఎల్‌ఆర్ బోనస్‌ను అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా సింగరేణి యాజమాన్యం సంస్థ లాభాల వాటా కింద ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,53,912 చెల్లించిన విషయం తెలిసిందే. దసరా లాభాల వాటాకు తోడు, ఇప్పుడు దీపావళి పీఎల్‌ఆర్‌ బోనస్‌ కూడా అందుతుండటంతో కార్మికుల ఇళ్లలో పండుగ వాతావరణం రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోందని, పండుగ వేళ ఇది వారి కుటుంబాలకు మరింత ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన బొగ్గును ఉత్పత్తి చేయడంలో సింగరేణి కార్మికుల కృషి ఎంతో అమూల్యమైనదని కిషన్‌రెడ్డి కొనియాడారు. భూగర్భంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. బొగ్గు రంగ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపునివ్వడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

దేశానికి వెలుగులు అందించేందుకు చీకటి గనుల్లో చెమటోడ్చే కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నింపాలన్నదే తమ సంకల్పమని మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ దీపావళి పండుగ సింగరేణి కార్మికుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, ఆర్థికాభివృద్ధితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.