- ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుసగా ముంచెత్తిన తీవ్ర తుపాన్ల కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని, గ్రామీణ ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ చివరి వారంలో విరుచుకుపడిన ఆర్నబ్ , తాజాగా నవంబర్ ప్రారంభంలో వినాశనం సృష్టించిన మురాసు తుపాన్ల ధాటికి రాష్ట్రంలోని వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వాకల్చర్, మత్స్య, పశుసంవర్ధక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమగ్ర లేఖ రాశారు.
ఈ వరుస ప్రకృతి విపత్తుల వల్ల వేలాది మంది రైతులు, కూలీలు, మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోయి వీధిన పడ్డారని మాధవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నబ్ తుపాను తదనంతర నష్టాలను అంచనా వేయడానికి తక్షణమే కేంద్ర అధ్యయన బృందాలను పంపించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. తాజాగా సంభవించిన మురాసు తుపాను నష్టాన్ని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెంటనే మరొక కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు. రెండు తుపాన్ల వల్ల వాటిల్లిన ఉమ్మడి నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు భారీ కేంద్ర సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు.
బాధిత రైతులకు తక్షణ నివారణ చర్యలతో పాటు, వ్యవసాయ పెట్టుబడి రాయితీలను త్వరితగతిన విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దెబ్బతిన్న పంటలకు నష్టపరిహార ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. ఉద్యానవనాలు, ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమలకు కూడా ప్రత్యేక పునరావాస సహాయం అందించడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. పంటల నష్టమే కాకుండా, తుపాన్ల తాకిడికి వర్షాల వల్ల ధ్వంసమైన మౌలిక వసతుల పునరుద్ధరణపై కేంద్రం దృష్టి సారించాలని మాధవ్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, విద్యుత్ వ్యవస్థలు , తాగునీటి సరఫరా మార్గాలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని లేఖలో విన్నవించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో స్పందించి ఏపీకి అండగా నిలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దెబ్బతిన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, అన్నదాతల జీవితాల్లో తిరిగి ఆశల వెలుగులు నింపేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీని త్వరలోనే ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు పి.వి.ఎన్. మాధవ్ వెల్లడించారు.







