- సరిత కోమటిరెడ్డి ఓటమి, అరుణా మిల్లర్ విజయం
- మరోసారి చర్చకు దారి తీసిన ఫలితాలు
- ఒకరు రిపబ్లికన్ పార్టీ తరఫున, మరొకరు డెమాక్రటిక్ పార్టీ తరఫున బరిలో
ఇంటర్నెట్ డెస్క్, మహా : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మూలాలున్న ఇద్దరు మహిళలు ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పోటీ చేసిన హైదరాబాదీ అరుణా మిల్లర్ వరుసగా రెండోసారి విజయ దుంధుభి మోగించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం బరిలోకి దిగిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమిపాలు కావడం గమనార్హం. ఒకరు విజయంతో మరోసారి ఉన్నత పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. మరొకరు ప్రజా సేవ కొనసాగిస్తానంటూ ఓటమిని అంగీకరించారు. అమెరికా రాజకీయాల్లో భారతీయ, ముఖ్యంగా తెలుగు మూలాలున్న మహిళల ప్రాతినిధ్యంపై ఈ ఫలితాలు మరోసారి చర్చకు దారితీశాయి.
హైదరాబాదీ అరుణా మిల్లర్‌కు రెండోసారి అవకాశం
మేరీల్యాండ్‌లో డెమోక్రటిక్ పార్టీ తరఫున గవర్నర్ వెస్ మూర్తో కలిసి పోటీ చేసిన అరుణా మిల్లర్‌కు ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. నవంబర్ 3వ తేదీన జరిగిన ఎన్నికల్లో మూర్-మిల్లర్ జోడీకి 62.55 శాతం ఓట్లు లభించాయి. దీంతో అరుణా మరో 4 ఏళ్లపాటు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొనసాగనున్నారు. 2022 ఎన్నికల్లో ఈ జోడీకి 64.53 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికతో పోలిస్తే ఓట్ల శాతం కొంత తగ్గినా.. స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. మేరీల్యాండ్ ఎన్నికల బోర్డు వెల్లడించిన తాజా ఫలితాల్లో ఈ వివరాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ నుంచి అమెరికా రాజకీయాల వరకు
అరుణా మిల్లర్‌కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1964 నవంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో తెలుగు కుటుంబంలో జన్మించిన అరుణా మిల్లర్.. 7 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. న్యూయార్క్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అనంతరం మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత రవాణా రంగంలో ఇంజినీర్‌గా పనిచేశారు. కాలిఫోర్నియా, వర్జీనియా, హవాయి రాష్ట్రాల్లో సుమారు 25 ఏళ్లపాటు వృత్తిపరమైన సేవలు అందించారు.
1990లో మేరీల్యాండ్‌కు మారిన అరుణా మిల్లర్.. ప్రజా సమస్యలపై ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమోక్రటిక్ పార్టీతో కలిసి పనిచేస్తూ 2010లో మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికయ్యారు. 2010 నుంచి 2018 వరకు అక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగారు. అనంతరం 2022లో గవర్నర్ అభ్యర్థి వెస్ మూర్తో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి అదే పదవిని దక్కించుకున్నారు.
తెలుగు మూలాలను మరిచిపోని అరుణా మిల్లర్
అమెరికాలోనే ఎక్కువకాలం గడిపినప్పటికీ తన తెలుగు మూలాలను అరుణా మిల్లర్ మరిచిపోలేదు. తెలుగు మాట్లాడటంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానం కొనసాగిస్తున్నారు. సాంబారు, గోంగూర, వంకాయ కూర వంటి తెలుగు వంటకాలు ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2011లో అప్పటి మేరీల్యాండ్ గవర్నర్ మార్టిన్ ఓమాలీతో కలిసి భారత్ పర్యటనకు వచ్చిన అరుణా మిల్లర్.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాల సమన్వయంలోనూ కీలకంగా వ్యవహరించారు. 2023లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భగవద్గీతపై ప్రమాణం చేశారు.
తాజా విజయంపై స్పందించిన అరుణా మిల్లర్.. భారతీయ అమెరికన్ల మద్దతు తనకు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. వలస కుటుంబాల నుంచి వచ్చిన యువత కూడా నాయకత్వ స్థానాలను అధిరోహించగలరనే నమ్మకాన్ని తన విజయం కలిగించాలని ఆకాంక్షించారు. తమ నేపథ్యం బలమే తప్ప పరిమితి కాదనే సందేశాన్ని యువతకు అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. భారతీయ అమెరికన్ల రాజకీయ భాగస్వామ్యం, ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పనిచేసే ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థకు 2019లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
సరితా కోమటిరెడ్డికి నిరాశ
మరోవైపు.. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డికి నిరాశ ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెపై.. ప్రస్తుత అటార్నీ జనరల్, డెమోక్రటిక్ పార్టీ నేత లెటిటియా జేమ్స్ విజయం సాధించారు. దీంతో జేమ్స్ వరుసగా మూడోసారి ఆ పదవిని చేపట్టి హ్యాట్రిక్ కొట్టారు. జేమ్స్‌కు 60.2 శాతం ఓట్లు రాగా.. సరితకు 39.8 శాతం ఓట్లు లభించాయి. తెలంగాణ మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన సరిత కోమటిరెడ్డి.. బ్రూక్లిన్‌లో జన్మించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్లో చదువుకున్న సరిత కోమటిరెడ్డికి న్యాయరంగంలో మంచి అనుభవం ఉంది. కొలంబియా లా స్కూల్లో లెక్చరర్‌గా పనిచేయడంతో పాటు ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్ వంటి కేసులతో సంబంధం ఉన్న వ్యవహారాలను పరిశీలించారు. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు. ఇక తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత తన పరాజయాన్ని సరిత కోమటిరెడ్డి అంగీకరించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశానని.. ఓటమి ఎదురైనా ప్రజా సేవను కొనసాగిస్తానని తెలిపారు. న్యూయార్క్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.







