Mahaa Daily Exclusive

  బ్యాలెట్ బాక్సుల బద్దలు.

Share

  •  పోలీసుల రక్తం కళ్ళజూసిన వైసీపీ శ్రేణులు.
  •  అనంత పరిషత్ పోరులో బరితెగింపు.
  •  రణరంగాన్ని తలపిస్తున్న పోలింగ్.

అనంతపురం, మహా.

అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ రణరంగాన్ని తలపిస్తోంది. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ శ్రేణులు.. ఏకంగా ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తూ పక్కా అరాచకాలకు తెరతీశాయి. కూడేరు మండలం మరుట్ల గ్రామంలోని రెండో కాలనీ పోలింగ్ బూత్‌లోకి చొరబడిన వైసీపీ మూకలు ఏకంగా బ్యాలెట్ బాక్సులనే బజారుకీడ్చాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవాలన్న కసితో బ్యాలెట్ బాక్సును బలవంతంగా బయటకు లాక్కొచ్చి, బండరాళ్లతో పగులగొట్టి పైశాచికత్వం ప్రదర్శించాయి. అక్రమాలను అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందిపైనా దాడులకు తెగబడటంతో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దౌర్జన్యంతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.

మరోవైపు కుందుర్పి మండలం బెస్తరపల్లిలోనూ వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన పొదుపు లక్ష్మి మహిళలను అడ్డుకుని, తమకే ఓటు వేయాలంటూ తీవ్ర బెదిరింపులకు గురిచేశారు. భయాందోళనకు గురైన మహిళలు స్థానిక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రకు మొరపెట్టుకున్నారు. వారికి ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే స్వయంగా బూత్ వద్దకు చేరుకోగా.. అక్కడే కాపు కాసిన వైసీపీ నాయకులు ఆయనపై భౌతిక దాడికి స్కెచ్ వేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న దశలో నాయకుడిని కాపాడుకునే క్రమంలో అడ్డుగా నిలబడిన గన్‌మెన్‌పై విచక్షణారహితంగా దాడికి దిగడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

వరుస దాడులు, దౌర్జన్యాలతో అనంతపురం జిల్లాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓట్లు వేసే సామాన్యులను బెదిరించడం, ప్రజాప్రతినిధులపై దాడులకు యత్నించడం, ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసుల రక్తం కళ్లజూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు.. భారీగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు లాఠీలకు పనిచెప్పి అల్లరి మూకలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.